బీఆర్వో బలోపేతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమీక్ష
ఇండో-మయన్మార్ బోర్డర్‌లో 1,600 కిలోమీటర్ల మేర వ్యూహాత్మక రహదారులు!
న్యూఢిల్లీ, మార్చి 25: దేశ రక్షణలో అత్యంత కీలకమైన సరిహద్దు రహదారుల సంస్థ (BRO) పనితీరుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దుల్లో సైనిక సంసిద్ధతను మెరుగుపరిచే అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సరిహద్దుల్లో పటిష్టమైన మౌలిక సదుపాయాలు కేవలం రక్షణకే కాకుండా, ఆ ప్రాంతాల అభివృద్ధికి మరియు అనుసంధానానికి వెన్నెముక వంటివని రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్వో నిర్మిస్తున్న రహదారులు అక్కడి ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని ఆయన కొనియాడారు.
భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి సుమారు 1,600 కిలోమీటర్ల మేర మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం బీఆర్వోకు అప్పగించింది. ఇది మన సరిహద్దు నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని రక్షణ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అలాగే 'బోర్డర్ రోడ్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ 2023-28' కింద చేపట్టిన 1,000కి పైగా ప్రాజెక్టుల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. గడ్డకట్టే చలి ఉండే హిమాలయ ప్రాంతాల్లో కూడా అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించేందుకు అత్యాధునిక 'ప్రీకాస్ట్' సాంకేతికతను ,మాడ్యులర్ బ్రిడ్జిలను వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా బీఆర్వోకు బడ్జెట్ పరంగా, ఆధునిక పరికరాల పరంగా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
బీఆర్వో డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ఈ సందర్భంగా సంస్థ సాధించిన విజయాలను వివరించారు. 1960లో స్థాపించబడినప్పటి నుండి బీఆర్వో ఇప్పటివరకు 64,000 కిలోమీటర్ల రహదారులు, 1,179 వంతెనలు, 22 విమానాశ్రయాలను నిర్మించిందని తెలిపారు. కేవలం దేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్ ,తజికిస్థాన్ వంటి మిత్ర దేశాల్లో కూడా బీఆర్వో కీలక ప్రాజెక్టులను పూర్తి చేసిందని పేర్కొన్నారు. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో పని చేసే కార్మికులు ,సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన కమిటీకి వివరించారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో బీఆర్వో పాత్ర అసమానమైనదని ఈ సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ , ఇతర ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment