ఇరాన్ అణు నిల్వలపై కన్నేసిన అమెరికా-ఇజ్రాయెల్?
అణు సామగ్రిని స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాల మోహరింపు యోచన?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా - ఇజ్రాయెల్ అత్యంత కీలకమైన , సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న అణు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి లేదా వాటిని నిర్వీర్యం చేయడానికి ఉమ్మడి ప్రత్యేక దళాలను మోహరించే అంశాన్ని ఇరు దేశాలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు 'ఆక్సియోస్' నివేదిక పేర్కొంది. ఇరాన్ తన అణు కేంద్రాల నుంచి అణు సామగ్రిని రహస్య ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో, ఈ ఆపరేషన్ నిర్వహించాలని వైట్ హౌస్ ,ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఇరాన్ అణు బాంబును తయారుచేయకుండా అడ్డుకోవడమే ఈ సంక్షోభంలో తమ ప్రధాన లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇజ్రాయెల్ ప్రధాని గతంలోనే స్పష్టం చేశారు.
అయితే, ఈ తరహా సైనిక చర్య అత్యంత ప్రమాదకరమని, ఇది నేరుగా అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ తన అణు కేంద్రాలను భూగర్భంలో, కొండల మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించింది. వీటిని చేధించడం అంత సులభం కాదని, ఒకవేళ ప్రత్యేక దళాలు అక్కడికి వెళ్లినా తీవ్రమైన ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ తన అణు నిల్వలను కాపాడుకోవడానికి ప్రతీకార దాడులను మరింత ఉధృతం చేసే ప్రమాదం ఉంది. ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ ఇరాన్ అణు సామగ్రిని ఆయుధాలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని భావిస్తే, ఏ క్షణమైనా ఈ మెరుపు దాడులు ప్రారంభం కావచ్చని ఆక్సియోస్ నివేదిక సారాంశం. ఇప్పటివరకు దీనిపై అమెరికా లేదా ఇజ్రాయెల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
No comments:
Post a Comment