- సీబీఐ అధికారుల సమాచారం.. మార్చి 16న విచారణ
హైదరాబాద్: ఢిల్లీ ఎక్సైజ్ విధానం (లిక్కర్ స్కామ్) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇటీవల ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను అధికారులు గురువారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అందజేశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈ నోటీసులు అందజేసినట్లు సమాచారం. సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై మార్చి 16న విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలు లేదా వాదనలు ఉంటే స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ తెలియజేయవచ్చు. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే, మీ గైర్హాజరీలోనే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని నోటీసులో స్పష్టం చేశారు. ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డారు.
- కవిత స్పందన
నోటీసులు అందిన విషయాన్ని కవిత సామాజిక మాధ్యమం 'ఎక్స్'ద్వారా ధృవీకరించారు. "ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసినప్పుడు నోటీసులు పంపడం అనేది ఒక సాధారణ చట్టపరమైన ప్రక్రియ. దీనిని ఎవరూ తప్పుగా చిత్రీకరించవద్దు. నేను నా లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను. చట్టపరమైన ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను" అని ఆమె పేర్కొన్నారు.
- నేపథ్యం
ఫిబ్రవరి 27న ఢిల్లీలోని ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు కవిత సహా 23 మందిని ఈ కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ మోపిన ఆరోపణలు న్యాయపరమైన విచారణకు నిలబడలేవని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేజ్రీవాల్, సిసోడియా సహా నిందితులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
No comments:
Post a Comment