బుధవారం 58 ప్రత్యేక సర్వీసులు
ప్రయాణికుల కోసం కేంద్రం భారీ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులను స్వదేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బుధవారం (మార్చి 4) ఒక్కరోజే భారతీయ విమానయాన సంస్థలు గల్ఫ్ ప్రాంతానికి 58 విమానాలను నడపనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఇందులో ఇండిగో సంస్థ 30 విమానాలను, ఎయిర్ ఇండియా ,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 23 విమానాలను నడపనున్నాయి. యుద్ధ ప్రాంతాల మీదుగా గగనతలం మూసివేయడంతో, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ విమానాలు ప్రయాణించనున్నాయి. కేవలం భారతీయ సంస్థలే కాకుండా ఎమిరేట్స్, ఇతిహాద్ వంటి విదేశీ విమానయాన సంస్థలు కూడా గత 24 గంటల్లో గల్ఫ్ నుంచి 9 సర్వీసులను నడిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు భారతీయ సంస్థలకు చెందిన 1,221 విమానాలు, విదేశీ సంస్థలకు చెందిన 388 విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో విమాన టికెట్ల ధరలు అదుపు తప్పకుండా మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూడాలని విమానయాన సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రయాణికులకు రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్ , ఇతర సహాయక చర్యల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, గల్ఫ్‌లోని ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ దేశాలకు సాధారణ విమాన సర్వీసుల నిలిపివేతను మార్చి 4 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకుంటూ భారతీయులందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
No comments:
Post a Comment