- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
- ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ఎప్పుడు?
- ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ వరకు గుండెకోత!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వేలాది భారతీయ కుటుంబాల్లో తీరని ఆందోళన నింపుతోంది. ముఖ్యంగా ఇరాన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న తమ పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఢిల్లీకి చెందిన కున్వర్ షకీల్ తన కుమార్తె గురించి చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో చదువుతున్న తన కుమార్తె కాలేజీ సమీపంలోనే సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించిందని, గడిచిన రెండు రోజులుగా దాడుల తీవ్రత పెరిగిందని ఆయన వాపోయారు. మంగళవారం ఆమె ఇండియాకు రావాల్సి ఉండగా, విమానాల రద్దుతో అక్కడే చిక్కుకుపోయిందని, పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ కలవాలంటే కనీసం 40 సార్లు ప్రయత్నించాల్సి వస్తోందని, ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోవడంతో సమాచారం అందక తల్లడిల్లుతున్నామని ఇతర తల్లిదండ్రులు వెల్లడించారు.
ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అక్కడి విద్యార్థులు పరిమితమైన ఆహార నిల్వలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హాస్టళ్లలో ఉన్న ఆహారం ఎంతకాలం వస్తుందో తెలియదని, నిరంతర బాంబు దాడులతో విద్యార్థులు నిరంతరం ఏడుస్తూ ప్రాణభయంతో ఉన్నారని మాలవీయ నగర్‌కు చెందిన జుబియా ఖాన్ తెలిపారు. గతంలో 'ఆపరేషన్ సింధు' ద్వారా భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్లే, ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం తమ పిల్లలను కాపాడుతుందని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (AIMA) ప్రతినిధి మోమిన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, భారత రాయబార కార్యాలయం విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులను టెహ్రాన్ నుండి ఖోమ్ (Qom) నగరానికి తరలిస్తున్నారని, కేవలం 5 కేజీల బ్యాగుతో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన 'ఎపిక్ ఫ్యూరీ', 'లయన్స్ రోర్' ఆపరేషన్లతో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ 'ట్రూత్‌ఫుల్ ప్రామిస్ 4' పేరుతో జరుపుతున్న క్షిపణి దాడులు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం ఇప్పటికే ఇరాన్‌లో 550 మందికి పైగా మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ వైపు కూడా ప్రాణనష్టం సంభవించింది. ఈ భీకర పోరులో చిక్కుకున్న తమ పిల్లలను త్వరగా రక్షించాలని బాధిత కుటుంబాలు ప్రధాని మోడీని , విదేశాంగ శాఖను వేడుకుంటున్నాయి.
No comments:
Post a Comment