- ఇజ్రాయెల్ హెచ్చరించిన చోటే బాంబుల మోత
- ఉద్రిక్తతల మధ్య కొనసాగిన ప్రదర్శనలు
ఇరాన్ రాజధాని టెహ్రాన్ మరోసారి భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే 'అల్-ఖుద్స్ డే' ప్రదర్శన కోసం వేలాదిమంది ప్రజలు ఫెర్దోసి స్క్వేర్ వద్ద గుమిగూడిన సమయంలో ఈ బాంబు దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకోబోతున్నామని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం ఆ ప్రదర్శనను కొనసాగించడం గమనార్హం. ఇజ్రాయెల్ తన ఫార్సీ భాషా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలు ఆ ప్రాంతం నుంచి తప్పుకోవాలని హెచ్చరిక జారీ చేసినా, ఇరాన్‌లో ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా ఆ సమాచారం ప్రజలకు చేరలేదు. పేలుడు సంభవించిన సమయంలో ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ గులాం హుస్సేన్ మొహ్సేనీ ఎజెయి ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతున్నారు. ఆయన అంగరక్షకులు వెంటనే అప్రమత్తమై ఆయనను రక్షించగా, "మిస్సైల్ వర్షం కురుస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గదు" అని ఆయన సవాల్ విసిరారు.
యుద్ధం ప్రారంభమై రెండు వారాలు కావస్తున్నా ఇరుపక్షాల మధ్య భీకర దాడులు ఆగడం లేదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన మొదటి అధికారిక ప్రకటనలో యుద్ధాన్ని కొనసాగిస్తామని , హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించారు. అయితే, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ స్పందిస్తూ.. మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వైపు ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించగా, అమెరికా, ఇజ్రాయెల్ దళాలు గత 14 రోజుల్లో ఇరాన్‌లోని సుమారు 15,000 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశాయని పెంటగాన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ పంపిన డ్రోన్లను సౌదీ అరేబియా, ఒమాన్ కూల్చివేస్తుండగా, దుబాయ్ ఆర్థిక కేంద్రం (DIFC) వద్ద కూలిన డ్రోన్ శకలాలు స్వల్ప నష్టాన్ని కలిగించాయి.
ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్రంగా పడుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి, ఇది యుద్ధానికి ముందు కంటే 40 శాతం అధికం. ఇరాక్ - లెబనాన్ సరిహద్దుల్లో కూడా పోరు తీవ్రమైంది. ఇరాక్‌లో అమెరికాకు చెందిన కేసీ-135 రీఫ్యూయలింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో నలుగురు సిబ్బంది మృతదేహాలు లభ్యమవ్వగా, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతున్నది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 600 మందికి పైగా మరణించగా, 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, హెజ్బుల్లాకు సహకరిస్తున్న లెబనాన్ భారీ ధర చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment