Tuesday, 10 March 2026

స్పీకర్ అవిశ్వాసం ప్రజాస్వామ్యంపై దాడి

 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం

కేంద్ర మంత్రి రిజిజుపై ప్రియాంకా గాంధీ సెటైర్లు


న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ పదవిని లక్ష్యంగా చేసుకోవడం అంటే అది నేరుగా 'ప్రజాస్వామ్యంపై దాడి' చేయడమేనని ఆయన అభివర్ణించారు. స్పీకర్ తొలగింపు తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న రిజిజు.. 2014లో అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వరుసగా రాజ్యాంగ సంస్థలపై దాడులకు తెగిస్తున్నదని ఆరోపించారు. ఓం బిర్లా ఎల్లప్పుడూ నిష్పాక్షికంగా వ్యవహరించారని, ప్రతిపక్ష సభ్యులకు తమ గళాన్ని వినిపించేందుకు సభలో మరిన్ని ఎక్కువ అవకాశాలు కల్పించారని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ తీర్మానంపై కనీసం 50 మంది ప్రతిపక్ష సభ్యులు వ్యక్తిగతంగా అసంతృప్తి వ్యక్తం చేశారని, కేవలం రాజకీయ ఒత్తిళ్ల వల్లే వారు దీనికి మద్దతు ఇస్తున్నారని రిజిజు వ్యాఖ్యానించారు.



 స్పీకర్ నిర్ణయమే అత్యున్నతమైనది

లోక్‌సభలో స్పీకర్ నిర్ణయమే అత్యున్నతమైనదని, దీనిని అందరూ ఆమోదించాలని గత ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీలు కూడా గతంలో స్పష్టం చేశారని రిజిజు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సభలో మాట్లాడటం తన హక్కు అని, ఎవరి అనుమతి అక్కర్లేదని రాహుల్ అనడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రధాని అయినా, మంత్రులైనా సభలో మాట్లాడాలంటే సభా కస్టోడియన్ అయిన స్పీకర్ అనుమతి తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గతంలో సభలో ప్రధానిని కౌగిలించుకోవడం, తోటి సభ్యులకు కన్నుగీటడం వంటి చర్యలు ఆయన గంభీరత లేని స్వభావాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు. రాహుల్ కంటే ప్రియాంక గాంధీ వాద్రా మెరుగైన ప్రతిపక్ష నేత కాగలరని ఆయన వ్యాఖ్యానించారు.


మోడీ  తామర పువ్వులాంటి స్వచ్ఛమైన వ్యక్తి

ఓం బిర్లా నాయకత్వంలో పార్లమెంటు కార్యకలాపాలు ఎంతో సంస్కరించబడ్డాయని, సభను పేపర్ లెస్ (కాగిత రహితం)గా మార్చడంతో పాటు యువ సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించారని రిజిజు కొనియాడారు. ఎన్డీఏ సభ్యులు ఎప్పుడూ సభలో పేపర్లు చింపివేయలేదని లేదా సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కలేదని, కానీ కాంగ్రెస్ సభ్యులు అలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. స్పీకర్ చేసిన మంచి పనులను గుర్తించి కృతజ్ఞత తెలపాల్సింది పోయి, ఆయనపై ద్వేషంతో ఇలాంటి తీర్మానం తీసుకురావడం శోచనీయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై బురద చల్లడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, ఆయన 'తామర పువ్వులాంటి స్వచ్ఛమైన వ్యక్తి' అని పేర్కొంటూ కిరణ్ రిజిజు తన ప్రసంగాన్ని ముగించారు.





అందుకేనా నన్ను రేయింబవళ్లు విమర్శిస్తున్నారు?

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఉదహరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను రేయింబవళ్లు విమర్శించే వారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను నవ్వుతున్నానని రిజిజు చెబుతున్నారని, అందుకే రేయింబవళ్లు తనను విమర్శిస్తున్నారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ వాదన కోసం రిజిజు నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకించారని తాను తెలియజేస్తున్నానన్నారు. "వారు (రిజిజును ఉద్దేశించి) అకస్మాత్తుగా నెహ్రూను గౌరవించడం ప్రారంభించారు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం అలాంటి ప్రసంగం చేశారు " అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.


ప్రభుత్వం ముందు తలవంచని ఏకైక వ్యక్తి రాహుల్

కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచని ఏకైన వ్యక్తి ఉన్నారని, ఆయనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ సభలో విపక్ష నేత ఎటువంటి సంకోచం లేకుండా నిజాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ట్రెజరీ బెంచీలపై కూర్చున్న వారు ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.


కేంద్రంపై మండిపడ్డ ప్రియాంక

పార్లమెంట్‌ హౌస్ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంపై ప్రియాంక మండిపడ్డారు. ట్రేడ్ డీల్‌పై సంతకం చేయడం ద్వారా భారత ప్రభుత్వం అమెరికా ముందు తలవంచిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిందని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ సంస్థలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పీకర్ ఓం బిర్లాపై ఒత్తిడి తెచ్చి ఆయన స్వాతంత్ర్యానికి ఆటంకం కలిగించిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అందుకే ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ సభలో లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవని విమర్శించారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించడానికి కేంద్రం ప్రభుత్వం సభలో అసంబద్ధమైన అంశాలను లేవనెత్తుతున్నదని  పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

ముజ్తబా ఖమేనీ శాంతిగా ఉంటారని నేను నమ్మను

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్ఇ రాన్ నూతన సుప్రీం లీడర్‌గా ముజ్తబా ఖమేనీ నియమితులైన నేపథ్యంలో అమెరికా అధ్యక్...