- రాజ్యసభకు వెళ్తున్నట్లు అధికారిక ప్రకటన
- బిహార్ రాజకీయాల్లో ముగిసిన సుదీర్ఘ శకం
పట్నా: కొన్నిరోజులుగా బిహార్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను రాజ్యసభసభ్యుడిగా వెళ్లాలని భావిస్తున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. జేడీయూ (JD-U) అధ్యక్షుడిగా, రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నీతీష్, ఇప్పుడు జాతీయ రాజకీయాలవైపు అడుగులువేయాలని నిర్ణయించుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నామినేషన్ల గడువు ముగియడానికి కొద్దిగంటల ముందు ఆయన ఈ ప్రకటన చేయడం రాజకీయవర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. తన రాజకీయ ప్రస్థానంలో అన్నిసభలలోనూ (అసెంబ్లీ, కౌన్సిల్, లోక్‌సభ) సభ్యుడిగా ఉన్నానని, ఇప్పుడు రాజ్యసభకు కూడా వెళ్లాలనే కోరిక ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నీతీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంతో బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఇప్పుడు అనేక సమీకరణాలు మారుతున్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్తుండటంతో రాష్ట్ర పగ్గాలను ఎవరు చేపడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో వినిపించిన ఊహాగానాల ప్రకారం.. బీజేపీకి ముఖ్యమంత్రి పదవిని అప్పగించి, నీతీష్ కుమారుడు నిశాంత్ కుమార్‌కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గౌరవప్రదంగా క్రియాశీల రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతోనే నితీష్ ఈ "మార్గదర్శక" పాత్రను ఎంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తన సుదీర్ఘ పాలనలో బిహార్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన, ఇప్పుడు కేంద్రస్థాయిలో పార్టీని, కూటమిని బలోపేతం చేసే బాధ్యతను తీసుకోనున్నారు.
ఈ అధికారిక ప్రకటనతో విపక్షాల విమర్శలకు కూడా నీతీష్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో జేడీయూ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు పట్నా పర్యటనలో ఉండటంతో, నీతీష్ రాజీనామా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దశాబ్దాల పాటు బిహార్ రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్, ఇప్పుడు పార్లమెంటు ఎగువ సభలో అడుగుపెట్టబోతుండటం ఒక చారిత్రక పరిణామంగా నిలవనుంది. బిహార్ ప్రజలు ,రాజకీయ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో రాబోయే నూతన నాయకత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment