Monday, 9 March 2026

ఖమ్మంలో ఉత్కంఠ: నిరవధిక నిరాహార దీక్షకు దిగిన కవిత


  • వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
  • రేవంత్ సర్కార్‌పై నిప్పులు

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల సమస్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, సోమవారం రాత్రి నుంచి ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్‌లో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఇళ్లు కూల్చివేసిన చోటే బాధితులకు ప్లాట్లు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే వరకు తన పోరాటం ఆపేది లేదని ఆమె భీష్మించుక కూర్చున్నారు. అంతకుముందు జడ్పీ సెంటర్లో బాధితులతో కలిసి ఆమె నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రాత్రి వేళ పోలీసులు విడుదల చేయడంతో ఆమె నేరుగా దీక్షా స్థలికి చేరుకున్నారు.



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెలుగుమట్ల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భూదాన్ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు గూడు కల్పించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని, ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆమె ప్రకటించారు. కవిత దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, బాధితులు అంబేడ్కర్ భవన్‌కు చేరుకోవడంతో ఖమ్మంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ప్రభుత్వం స్పందించి బాధితులకు లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా పోలీసులు కాలరాస్తున్నారని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కవిత పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని, వెలుగుమట్ల బాధితుల సమస్య కొలిక్కి వచ్చే వరకు విశ్రమించబోనని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

No comments:

Post a Comment

Featured post

బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు

  అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఇరాన్ అధ్యక్షుడు ఆగ్రహం ధీటుగా బదులిస్తామని హెచ్చరిక! టెహ్రాన్: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ...