Tuesday, 3 March 2026

ట్రంప్ ‘హోర్ముజ్’ ప్లాన్


  • భారత వ్యవసాయంపై అమెరికా గురి? 
  • ముంచుకొస్తున్న చమురు సెగ.. 
  • ఎకనామిస్ట్ సంచలన విశ్లేషణ!

న్యూఢిల్లీ/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న హోర్ముజ్ జలసంధి సంక్షోభం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహం దాగి ఉందా? ఈ ఉద్రిక్తతల వల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు బలికాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ ఇంధన ఆర్థికవేత్త అనస్ అల్హాజీ. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడం కేవలం యుద్ధం వల్ల జరిగిన ఆటంకం మాత్రమే కాదని, దీని వెనుక వాషింగ్టన్ ఒక పెద్ద భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బీమా సంస్థలు అకస్మాత్తుగా నౌకలకు 'వార్ రిస్క్ కవర్'ను ఉపసంహరించుకోవడం వెనుక ఆర్థిక కుట్ర ఉండవచ్చని, ఇది చమురు సరఫరాను స్తంభింపజేసి అమెరికా చమురు , సహజ వాయువు (LNG) పోటీతత్వాన్ని పెంచేలా ఉందని ఆయన విశ్లేషించారు.



భారత్‌కు ఎరువుల సెగ: అమెరికాకు లాభం?

ఈ సంక్షోభం వల్ల భారత్ తీవ్రంగా ప్రభావితం కానుంది. భారతదేశానికి అవసరమైన ఎరువుల దిగుమతుల్లో నాలుగో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే వస్తాయి. గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇప్పటికే భారత ప్రభుత్వం ఎరువుల కంపెనీలను గ్యాస్ వినియోగం తగ్గించాలని ఆదేశించింది. సాగు సీజన్  ముంగిట ఈ పరిణామం భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్‌లో పంట దిగుబడి తగ్గితే, అప్పుడు భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, వాషింగ్టన్ చాలా కాలంగా కోరుకుంటున్నది ఇదేనని అల్హాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ట్రంప్ మౌనం వెనుక రహస్యం

సాధారణంగా చమురు ధరలు పెరిగితే గొంతెత్తే ట్రంప్, ప్రస్తుత బీమా సంక్షోభంపై మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. గల్ఫ్ నౌకలకు అమెరికా నావికాదళం రక్షణ కవచం (Escort) ఇస్తుందని ట్రంప్ చెబుతున్నారు, కానీ ఇది రవాణా ఖర్చులను , బీమా ప్రీమియంలను విపరీతంగా పెంచుతుంది. తద్వారా గల్ఫ్ చమురు కంటే అమెరికా చమురు చౌకగా మారి ప్రపంచ మార్కెట్‌ను శాసించవచ్చనేది వైట్ హౌస్ ప్లాన్ కావచ్చు. ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం, గ్యాస్ సరఫరాలో 20 శాతం హోర్ముజ్ జలసంధిపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రతిష్టంభన త్వరగా తొలగిపోకపోతే, బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్కును దాటవచ్చని 'వుడ్ మెకెంజీ' వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.


ప్రపంచ ఆర్థికవ్యవస్థకు పెను ముప్పు

కేవలం భారత్‌నే కాకుండా బంగ్లాదేశ్, ఈజిప్ట్, జోర్డాన్ వంటి దేశాలు కూడా ఇంధన కొరతతో అల్లాడుతున్నాయి. గిరాకీకి తగిన సరఫరా లేకపోవడంతో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఒకవేళ ఇరాన్‌లో నాయకత్వ మార్పు లేదా అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుని ఉద్రిక్తతలు తగ్గితేనే చమురు ధరలు 80-90 డాలర్ల మధ్య స్థిరపడతాయని సిటీగ్రూప్ అంచనా వేస్తోంది. లేనిపక్షంలో ప్రపంచం తీవ్రమైన ఆర్థిక , రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని, ఈ పరిణామాలు ఊహించని రీతిలో పాలన మార్పులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు  కాళేశ్వరం విచారణలో కీలక మలుపు హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ...