- ఇరాన్ గ్యాస్ నిక్షేపాలపై దాడులు నిలిపివేసిన ఇజ్రాయెల్
- 119 డాలర్లకు చేరిన ముడి చమురు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు అత్యంత వ్యూహాత్మకమైన 'సౌత్ పార్స్' గ్యాస్ నిక్షేపాలపై దాడులు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విన్నపాన్ని ఇజ్రాయెల్ మన్నించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడిన ట్రంప్, ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలం అవుతుందని హెచ్చరించారు. ట్రంప్ సూచన మేరకు ప్రస్తుతం ఆ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము ఇప్పటికే గణనీయంగా దెబ్బతీశామని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ మాత్రం తన క్షిపణి ,డ్రోన్ దాడులతో ప్రాంతీయ దేశాలను వణికిస్తూనే ఉంది.
- ఖతార్‌లో బీభత్సం - ఇరాన్ అధికారుల బహిష్కరణ
ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 'ఖతార్ ఎనర్జీ'కి చెందిన కీలకమైన ఎల్‌ఎన్‌జీ (LNG) మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఖతార్ ప్రభుత్వం, తమ దేశంలో ఉన్న ఇరాన్ సైనిక , భద్రతా అధికారులను 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ 'పర్సోనా నాన్ గ్రాటా' (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించింది. గల్ఫ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఈ స్థాయిలో దెబ్బతినడం యుద్ధం మరింత విస్తరిస్తోందనే దానికి సంకేతంగా కనిపిస్తోంది.
- భారత్‌పై ఇంధన సెగ
ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై చావుదెబ్బ కొట్టింది. బ్రెంట్ ముడి చమురు ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 119 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి చమురు ధరలు ఏకంగా 60 శాతం పెరగడం గమనార్హం. హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడటం, సౌదీ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరగడం వంటివి సప్లై చైన్‌ను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పెట్రోల్ , గ్యాస్ దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారింది. దేశీయంగా నిత్యావసరాల ధరలు పెరగడమే కాకుండా ఆర్థికవృద్ధిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment