- అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఎందుకిది అత్యంత కీలకం?
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్‌కు చెందిన అత్యంత వ్యూహాత్మక ప్రాంతం 'ఖార్గ్ ఐలాండ్' (Kharg Island) ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌లో కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న ద్వీపాన్ని ఇరాన్ ఆర్థికవ్యవస్థకు 'కిరీటపు రత్నం' (Crown Jewel) అని పిలుస్తారు. ఎందుకంటే ఇరాన్ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఒక్క ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై భారీగా బాంబు దాడులు చేశామని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక్కడి చమురు మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిస్తే ఇరాన్ ఆర్థిక వెన్నుముక విరిగిపోతుందనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖార్గ్ ద్వీపం ఇరాన్ ప్రధాన భూభాగానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి లోతైన నీటి సౌకర్యాల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ట్యాంకర్లు ఇక్కడ సులభంగా లోడింగ్ చేయగలవు. అహ్వాజ్, మరున్ వంటి ఇరాన్ ప్రధాన చమురు క్షేత్రాల నుంచి పైపులైన్ల ద్వారా క్రూడ్ ఆయిల్ నేరుగా ఇక్కడి స్టోరేజ్ ట్యాంకులకు చేరుకుంటుంది. అందుకే ఈ ద్వీపాన్ని ఇరాన్ ఒక 'అజేయమైన కోట'లా భావిస్తుంది. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ ఈ చమురు టెర్మినల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటే, ఇరాన్ ప్రభుత్వానికి అందే ప్రధాన ఆదాయ వనరు నిలిచిపోతుంది. ఇది ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
అయితే, ఖార్గ్ ఐలాండ్‌పై దాడులు కేవలం ఇరాన్‌కే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ద్వీపం నుంచి చమురు సరఫరా ఆగిపోతే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటగా, ఇది 130 డాలర్లకు చేరితే భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే అమెరికా ప్రభుత్వం కూడా ఈ ద్వీపంపై దాడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇరాన్ , ఈ కీలక ఆస్తిని కాపాడటానికి ఇరాన్ నౌకాదళం , వైమానిక దళం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
No comments:
Post a Comment