Monday, 2 March 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా మౌనం వెనుక మర్మమేంటి?


  • డ్రాగన్ దేశం ఆచితూచి అడుగులేయడానికి గల అసలు కారణాలను విశ్లేషించిన నిపుణులు!

బీజింగ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అట్టుడుకుతున్న వేళ, ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తున్న చైనా మౌనం వహించడం వెనుక బలమైన వ్యూహాలు దాగి ఉన్నాయని రక్షణ , దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 80 శాతానికి పైగా చైనానే కొనుగోలు చేస్తున్నది. అయినప్పటికీ, ఈ యుద్ధంలో ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా కేవలం 'కాల్పుల విరమణ' కావాలని పిలుపునివ్వడం వెనుక చైనా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా 'హోర్ముజ్ జలసంధి' ద్వారా చైనాకు అందే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే, ఆ దేశ పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. చైనా తన మొత్తం చమురు దిగుమతుల్లో 44 శాతం ఈ ప్రాంతం నుంచే పొందుతున్నది.



ఇరాన్ కేవలం ఒక చమురు దేశం మాత్రమే కాకుండా, చైనా ప్రతిష్టాత్మక 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' (బీఆర్‌ఐ)లో కీలక భాగస్వామి. అయితే, ఇరాన్ తనకంటే శక్తివంతమైన కూటమితో తలపడటం ద్వారా చైనా నిర్మించిన భౌగోళిక రాజకీయ నిర్మాణాన్ని ప్రమాదంలో పడేసిందని 'అవెల్లాన్ ఇంటెలిజెన్స్' సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్‌కు చైనా మద్దతు ఎంత అవసరమో, చైనాకు ఇరాన్ చమురు అంతే కీలకం. కానీ ఈ యుద్ధం వల్ల చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరితే చైనా ఆర్థిక వృద్ధి లక్ష్యాలు దెబ్బతింటాయి. అందుకే చైనా బయటకు శాంతి మంత్రం జపిస్తూనే, తెరవెనుక ఇరాన్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నది. ఒకవేళ యుద్ధం వల్ల ఇరాన్ బలహీనపడితే, ఆ దేశం భవిష్యత్తులో పెట్టుబడులు , దౌత్య రక్షణ కోసం చైనాపై మరింతగా ఆధారపడే అవకాశం ఉందని, దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని బీజింగ్ భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

ట్రాఫిక్ కెమెరాల నిఘా.. మోసాద్ మాయాజాలం

 ట్రాఫిక్ కెమెరాల నిఘా.. మోసాద్ మాయాజాలం  ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతానికి అమెరికా, ఇజ్రాయెల్ పక్కా స్కెచ్! టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ అత్...