Showing posts with label tdp. Show all posts
Showing posts with label tdp. Show all posts

Sunday, 6 July 2025

అదే నిజమైతే నగరంలో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేశారు?




ఈ వారం 'కొత్తపలుకు'లో రాధాకృష్ణ రాతలు మహాటీవీ వంశీ విద్వేషానికి కొనసాగింపే. కడుపులో కత్తులు పెట్టుకుని తెలంగాణ మీద లేని ప్రేమ చూపెట్టే రాధాకృష్ణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ ఉద్యమాన్ని, బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేలా అసత్య కథనాలు వండివార్చారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు వెనుక అనేక కారణాలున్నాయి. చంద్రబాబు, టీడీపీ సానుభూతి పరుల వల్లనే కాంగ్రెస్‌ గెలిచిందని రాధాకృష్ణ అనుకుంటే అది ఆయన భ్రమే. ఎందుకంటే సైబరాబాద్ ను నిర్మించానని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నేనే పెట్టానని గప్పాలు కొట్టే చంద్రబాబును పట్టించుకునే స్థితిలో నగర ప్రజలు లేరు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ ముఖచిత్రమే మారిపోయింది. కేసీఆర్‌ నాయకత్వంలో మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ విజన్‌ వల్ల హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. అంతర్జాతీయ కంపెనీలన్నీ బెంగళూరును కాదని హైదరాబాద్‌లో తమ సంస్థలను నెలకొల్పాయి. 

“తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది’ అని వ్యాఖ్యానించడం నిజం కాదా?” అని రాధాకృష్ణ తన కాలమ్‌ రాశారు. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో ఆంధ్రజ్యోతి గురించి ఎక్కడా పై వాక్యాలు రాయలేదు. మీడియా మేనేజ్‌మెంట్‌ గురించి ఆ నివేదికలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 13 టీవీ ఛానెళ్లు, 5 దినపత్రికలు ఉన్నాయి. అందులో రాజ్ న్యూస్ (టీ న్యూస్) మరియు హెచ్ఎం టీవీ తప్ప మిగతా మీడియా సంస్థలన్నీ తెలంగాణను వ్యతిరేకించాయన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఉద్యమాన్నిచల్లబరచాలంటే  ఈ రెండు ఛానల్స్‌ మినహా మిగిలిన ఛానల్స్‌ను మేనేజ్‌ చేయాలని సూచన చేసింది. 

ఇక చంద్రబాబు అరెస్టు పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వల్ల టీడీపీ సానుభూతిపరులు గుర్రుగా ఉన్నారని రాధకృష్ణ అన్నారు. అదే నిజమైతే నగరంలో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేశారో, మొత్తం సీట్లన్నీ ఎలా గెలిచిందో చెబితే బాగుండేది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఢిల్లీ నుంచి గల్లీదాకా జరిగినా ముఖ్యకేంద్రం హైదరాబాదే. ఉద్యమకాలంలో అయినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అయినా ఇక్కడ నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజల భద్రత బాధ్యతను కేసీఆర్‌ తీసుకున్నారు. శాంతిభద్రత విషయంలో రాజీపడలేదు. రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని అందించే హైదరాబాద్‌ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ప్రజలు గత ఐదు దశాబ్దాల్లో చూడని అభివృద్ధిని చూశారు. కానీ ఎన్నడూ కేసీఆర్‌, కేటీఆర్‌లు చంద్రబాబులా సెల్ఫ డబ్బా కొట్టుకోలేదు. 



ఏపీ కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందని కేసీఆర్‌, కేటీఆర్‌ భయపడుతున్నారట. 2014, 2018, 2023 బీఆర్‌ఎస్‌ సింగిల్‌గానే పోటీ చేసింది. 2018లో చంద్రబాబు మహాకూటమిలో చేరి మొత్తం బాధ్యత తానే తీసుకున్నా బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. 2014లోనూ మోడీ హవా దేశమంతా వీచినా ఇక్కడ ఆ పార్టీ ప్రభావం ఏమీ కనిపించలేదు. 2018లో అయితే సింగిల్‌ సిటుకే పరిమితమైంది. ఏపీ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) , కాంగ్రెస్‌ కలిసి పోటీచేసినా 2028లో ఏం జరగబోతుందనేది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. కూటములతో వచ్చినా, అనైతిక పొత్తులతో పోటీ చేసినా కేసీఆర్‌ భయపడుతారా? ఉద్యమనాయకుడికి తెలంగాణ ప్రజల చైతన్యం తెలువదా? ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్ని గుంజుకున్న చంద్రబాబుకు ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు. అలాంటి చంద్రబాబుకు కేసీఆర్‌ కు పోలిక ఎందులోనూ లేదు. ఇక  ఏపీలో సూపర్‌ సిక్స్‌  హామీలను చంద్రబాబు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలను ఆయన శిష్యుడు రేవంత్‌ రెడ్డి అమలు చేయలేమని చేతులెత్తేశారు. 


రాధాకృష్ణ అసలు బాధ ఏపీలో జగన్‌మోహన్‌ రెడ్డి మళ్లీ గెలిస్తే ఎక్కడ తన అయిపోతుందో అని అంతర్గత భయం ఆయనను వెంటాడుతున్నది. అందుకే ఇప్పటికీ జగన్‌కే కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారని ఆయన తన రాతల్లో అక్కసు వెళ్లగక్కారు. అయితే 2014లో ఓటుకు నోటు కేసు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల తర్వాత వైసీపీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకూడదని నిర్ణయించుకున్నది. దానికే కట్టుబడి ఉన్నది. అంతేగాని చంద్రబాబు లాగా శిఖండి రాజకీయాలు చేయడం లేదు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే 2023 డిసెంబర్‌ వరకు కేసీఆర్‌ ఉన్నంత వరకు వాటిని తిప్పికొట్టారు. ఆయనను అమరావతికి తరమికొట్టారు. ఇప్పుడు ఆయన తాబేదారు రేవంత్‌ రెడ్డి చేతగాని తనం వల్ల ఆయన మళ్లీ ఇక్కడ రాజకీయాలు మొదలుపెట్టారు. అయితే కేసీఆర్‌ ఆ మధ్య అన్నట్టు నాకు గట్టిగానే కొట్టడం తప్ప మెల్లగా కొట్టడం అలవాటు లేదన్నారు. 2028లో అదే జరగబోతున్నది. కేసీఆర్‌ తెలంగాణలో కొట్టే ఆ రాజకీయ దెబ్బ అమరావతిలోనే కాదు హస్తినలోని వినిపిస్తుంది. ఆ సౌండ్‌ ఎంత భయంకరంగా ఉంటుందో విందువు. అప్పటివరకు స్టే ట్యూన్‌ రాధాకృష్ణా!

నాడు మద్రాస్‌, నేడు హైదరాబాద్‌






తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయం. ఎడిట్‌ పేజీలో పరాంకుశం వేణుగోపాల స్వామి, నేను, జ్యోతింధ్రనాథ్‌ ఉండేవాళ్లం. వేణు సార్‌, నేను తెలంగాణ జ్యోతింధ్రనాథ్‌ గారు ఆంధ్ర. కాబట్టి సహజంగానే ఆయన విభజనను వ్యతిరేకిస్తారు. అయితే ఆయన చాలా ప్రోగ్రెసివ్‌. విభజనను గుడ్డిగా వ్యతిరేకిస్తూ బాధకృష్ణ లాంటి వాళ్ల వాదనను వినిపించేవారు కాదు. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వినిపించేవారు. అయితే విభజన అనివార్యమైతే తర్వాత జరగబోయే పరిణామాలపై ఆయనకు కొంత బాధ ఉండేది. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షకు అప్పటి నెహ్రూ ప్రభుత్వం స్పందించింది. దీక్ష విరమించాలని కోరింది. కానీ మద్రాస్‌తో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ను కొంతమంది ముందుకు తెచ్చి శ్రీరాములు దీక్ష కొనసాగించేలా చేశారు. ఫలితంగా ఏ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేశారో ఆయన అది చూడకుండానే కన్నుమూశారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ పదే పదే ఒక మాట చెప్పేవారు. మా పోరాటం తెలంగాణ వనరులను దోచుకునేవారిపై, ఇక్కడ పెత్తనం చేసే వారిపై మాత్రమేనని పొట్టగూటి కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిపై కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్రేకపూరిత పూరిత ప్రసంగాలు చేసినా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పాలకుడిగా తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించారు. ఏ ప్రాంత ప్రజలపై వివక్ష చూపెట్టలేదు. అందుకే విభజనను అప్పుడు, ఇప్పుడు వ్యతిరేకించే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా కేసీఆర్‌ పాలన విధానాన్ని ప్రశంసించారు. ఆంధ్ర వాళ్ల కాలి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న కేసీఆర్‌ మా వారి మనసు దోచారు. అంతేకాదు తన హయాంలో ఎక్కడా మత ఘర్షణలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా చూశారు. 


తెలంగాణ ఉద్యమం సాగింది నీళ్లు, నిధులు, నియామకాల్లో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు. ఆత్మగౌరవ కోసం కూడా. అందుకే అధికారంలో లేకున్నా ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని గడిచిన 18 నెలల కాంగ్రెస్‌ పాలనలో రేవంత్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తే అర్థమౌతుంది. ఇదందా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అప్పుడు జ్యోతింధ్రనాథ్‌ ఒక మాట అన్నారు. విభజన జరిగితే అప్పుడు మద్రాస్‌ కోల్పోయాం. ఆ తర్వాత కర్నూల్‌ పోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ మాకు కాకుండా పోతున్నదని ఆవేదన చెందారు. దీనికి స్వామిగారు ఫన్నీగా ఒక కామెంట్‌ చేశారు. అప్పుడు మద్రాస్‌, ఆ తర్వాత కర్నూల్‌, ఇప్పుడు హైదరాబాద్‌. రేపు ఇగ మిగిలేది బంగాళఖాతమే అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఏపీపై ఆ ప్రాంత నాయకులకు లేదని. ఎందుకంటే మాట్లాడితే ఆంధ్రులు అని గొప్పలు చెప్పుకోవడమే గాని ఆరు దశాబ్దాల కాలంలో వారికంటూ ఒక రాజధాని నగరం అంటూ ఏదీ నిర్మించుకోలేకపోయారు. చంద్రబాబు మొదటి ఐదేళ్లు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడమే తప్ప శాశ్వత సెక్రటేరియట్‌ కట్టలేదు. ఆ తర్వాత జగన్‌ ఐదేళ్లు పాలించినా ఆయన సంక్షేమపై దృష్టి సారించారు. అలాగే అమరావతి పేరుతో గత ప్రభుత్వం చేసిన భూదందాను వెలికి తీశారు. అక్కడ పెట్టే పెట్టుబడి, నిర్మాణాలు వృథా అవుతాయని నిపుణుల సూచన ఆధారంగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టలేదు. విశాఖ ను రాజధాని కేంద్రంగా చేయాలని, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీనికే మూడు రాజధానులు అని పేరు పెట్టారు. 


అయితే ఈ అంశాన్ని చంద్రబాబు సామాజిక వర్గం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి జగన్‌కు వ్యతిరకంగా ప్రచారం చేసింది. దీనికితోడు ఉచితలు అభివృద్ధికి ఆటంకం అనే మోడీ కూడా చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలకు గ్యారెంటీ ఇవ్వకుండా ఆయనతో జట్టు కట్టింది. ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్‌ సిక్స్‌ గురించి బాధకృష్ణ గాని, బాబు ఏం చేసినా బాకాలు ఊదే మీడియా చర్చ చేయదు. కానీ చంద్రబాబు ఏదో అద్భుతం చేయబోతున్నారని నిత్యం ప్రజలను ఏ మార్చే కథనాలు  వండివారుస్తుంటాయి. దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఆంధ్రులకు ఒక రాజధాని ఉండాలనే కల మాత్రం ఎన్నటికీ నెరవేరదు. దీనికి కారణం ఆచరణలో సాధ్యం కాని కోరికలు కొంతమంది పాలకులకు, మీడియా ప్రతినిధులకు, కొంతమంది పెట్టుబడి దారులకు ఉండటమే. నాడు మద్రాస్‌పై మమకారాన్ని వదులుకోలేదు. విభజన జరిగి 11ఏండ్లు అయినా హైదరాబాద్‌పై ఆశలు వదులుకోవడం లేదు. హైదరాబాద్‌ కేంద్రంగానే చంద్రబాబు అండ్‌ కో, బాధకృష్ణ లాంటి వాళ్లు చేస్తున్న కుట్రల ఫలితంగా అమరావతి రాజధాని పత్రికల్లో, ప్రచారంలో ఉంటుంది. కానీ ఎన్నటికీ అక్కడి ప్రజలకు అందుబాటులోకి రాదు.

Thursday, 10 April 2025

ఇది కదా తెలంగాణ సోయి అంటే!

 


తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ రెడ్డి పాత్ర ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన గురువు చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ పధ్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఉద్యమనాయకుడు, పదేళ్లు సీఎంగా పనిచేసి వ్యక్తి, గుర్తుకురారు. అంతేలే.  చంద్రబాబు సూత్రధారిగా, రేవంత్‌ రెడ్డి పాత్రధారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఛేదించిన నాయకుడి పేరు తలుచుకోవాలన్నా, ఆయనతో పోల్చుకోవాలన్నా ఉద్యమకాలంలో తమరి ట్రాక్‌ రికార్డు కూడా సక్కగ లేదాయే. అందుకే ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుతారు కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ కేసీఆర్‌ పేరు ప్రస్తావించాల్సి వస్తుందోనని అతి తెలివితో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి అభాసుపాలవడం మీకు అలావాటుగా మారింది. తెలంగాణ విషయంలో ఫణికర మల్లయ్యకు ఉన్న చైతన్యం కూడా లేకపాయే. ఏం కావాలి అని మీ గురువు చంద్రబాబు అడిగితే మరో మాట లేకుండా తెలంగాణ కావాలన్నడు. ఇది కదా తెలంగాణ సోయి అంటే!

బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏపీనేనా?

 


Sunday, 12 May 2024

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?


ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశాయి. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించాక కొంత సానుకూల వ్యక్తమైంది. వైసీపీ కంటే ఆ కూటమి వైపే కొంత ప్రజలు మొగ్గుచూపినట్టు ఆ సర్వే సంస్థలు వెల్లడించిన నివేదిక ఆధారంగా తెలిసింది. అయితే ఎప్పుడైతే బీజేపీ కూటమిలో చేరిందో మొత్తం సీన్‌ మారిపోయిందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌. 


అంతెందుకు మెగా ఫ్యామిలీలోనే మెనీ పార్టీలు అన్నట్టు రెండుమూడు రోజులుగా అక్కడ రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమౌతుంది. అక్కడ ఏపార్టీ గెలుస్తుంది అనే దాని ప్రజలు తేలుస్తారు. కానీ కొన్ని మీడియా సంస్థలు పీకే అభిప్రాయమే ప్రజాభిప్రాయం అన్నట్టు అక్కడ అధికారపార్టీ పని అయిపోయినట్టు, కూటమివైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ-జనసేన ప్రజలకు ఇచ్చిన హామీలకు తమది బాధ్యత కాదన్నట్టు బీజేపీ వ్యవహరిస్తున్నది. 


అలాగే ఏపీ విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందనేది అక్కడ జనాల్లో ఉన్న అభిప్రాయం. అలాంటి బీజేపీ కూటమిలో చేరడం వల్ల టీడీపీ-జనసేనలకు నష్టం జరుగుతుంది కానీ జగన్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదనే వాదన వినిపిస్తున్నది.

Thursday, 1 February 2024

పొంగులేటి వ్యాఖ్యలతో టీడీపీకి లాభమా? నష్టమా?



తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపడం వల్లనే ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో టీడీపీ స్థాపించారో నారా చంద్రబాబు నాయుడు దానికి ఎన్నడో తిలోదకాలిచ్చారన్నది ఆయన అభిమానుల వాదన. అందుకే ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆపార్టీలో చేరిన వారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారంతా అభిమాన నాయకుడి ఆశయాల మేరకే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టిన ఉద్దేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. పొంగులేటి వ్యాఖ్యల వల్ల ఏపీలో టీడీపీ లాభమా? నష్టమా? అన్న చర్చ జరుగుతున్నది. 


అలాగే తెలంగాణలో వలె ఏపీలోనూ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున టీడీపీకి ఆ పార్టీ మద్దతు ఇస్తుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వద్ద ఉండదు. దీనిపై స్పందించడానికి టీడీపీ సిద్ధంగా ఉండదు. మరో ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విస్మరించిన అంశాల పరిష్కారం కోసం కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేశారు. అంతేగాని టీడీపీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగాని, ఆ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టుగాని అధికారికంగా ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటులో ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ సీటు గెలుచుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతున్నది. 


పొంగులేటి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ  అభిప్రాయమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఒకవేళ పొంగులేటి వ్యాఖ్యలు నిజమైతే ఏపీలో టీడీపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని అక్కడ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఈ విషయాన్నే అధికార వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  వ్యాఖ్యల వల్ల టీడీపీకి లబ్ధి జరుగుతుందో లేదో తెలియదు. కానీ విమర్శలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అక్కడి రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Saturday, 13 January 2024

ఏపీలో సిట్టింగ్‌ల మార్పుతో 'ఫ్యాన్‌' గాలి వీస్తుందా?


అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణలో ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. సిట్టింగులను మార్చి ఉంటే తెలంగాణలో ఫలితాలు వేరేలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అంటే ఆ అభ్యర్థికే దాదాపు అసెంబ్లీ టికెట్‌ ఖారారు అయినట్టు భావించాలి. జగన్‌ సుమారు 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీని వీడిన వాళ్లలో ఎక్కువ శాతం మంది అయితే జనసేన లేదా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాల్సిందే. ఎందుకంటే  టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రకటించాయి. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఏమైనా రాజకీయ పరిణామాలు మారొచ్చు అంటున్నారు. అదే జరిగితే జనసేనతో బీజేపీ జట్టుకట్టే అవకాశాలున్నాయి. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌ పురంధేశ్వరీ కూడా ఇప్పటికైతే జనసేనతో తమ పార్టీకి పొత్తు కొనసాగుతున్నది. పొత్తులపై తమ పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు. 


పదేళ్ల కేంద్ర ప్రభుత్వం, విభజన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైసీపీలు ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నది వాస్తవం. ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నది. నాటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వంతో పాటు వాటిని సాధించడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయి అన్నది ఆ పార్టీ విమర్శ. కాబట్టి ఏపీ ఎన్నికల తీర్పు ఈసారి ఏకపక్షంగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 'వోటా' సర్వే సంస్థ రెండు నెలలుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ సంస్థ సీఈవో కంభాలపల్లి కృష్ణ కూడా ఏపీలో ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంటున్నారు. దాదాపు 50 మంది సిట్టింగులను మార్చడం వల్ల వైసీపీ అందులో సగానికి పైగా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ మార్చకుండా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే జగన్‌ నష్టనివారణ చర్యలో భాగంగానే చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికల నాటికి ఏపీలో ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

Friday, 12 May 2023

పవన్‌ నిలకడలేని నిర్ణయాలు.. ప్రశ్నార్థకంలో ఆ పార్టీ మనుగడ


పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం, పొత్తులు పెట్టుకోడం సహజమే. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే పొత్తులు పెట్టుకుంటామనడమే ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన పొత్తులపై మాట్లాడుతూ..' వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించి  అధికారాన్ని చేజిక్కించుకోవడం, కూటమి ద్వారా తిరిగి ప్రజలకు దక్కాలి' అన్నారు. పొత్తులపై కొందరు అంగీకరించకపోవచ్చని, వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తామని, ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తర్వాత ఇదే చెప్పాం. తన నిర్ణయం మారదు' అన్నారు.


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పవన్‌ వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి. మొత్తం 175 స్థానాల్లో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే సీట్ల విషయంలో అన్నిపార్టీలు రాజీపడాలి. జనసేన అధినేతగా పవన్‌ ఆధేశాల ప్రకారం వాళ్ల నేతలు అంగీకరిస్తారు అనుకుందాం. మరి బీజేపీ, టీడీపీ ల నేతలు పొత్తులో భాగంగా సీట్లు త్యాగాలు చేయడానికి సిద్ధపడుతారా? మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏపీలో బీజేపీ కంటే వామపక్షాల బలమే ఎక్కువ. విపక్ష కూటమిలో బీజేపీ ఉంటే వామపక్షాలు వారితో కలిసి వస్తాయా? భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు ఉన్న పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని, అందుకు కొంతమంది అంగీకరించకున్నా ఒప్పిస్తానని పవన్‌ అనడం హాస్యాస్పదం. 


ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. కానీ ఐదేళ్లలో బాబు ఏం చేశారో అనుభవంలో ఉన్నదే. అలాగే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన జనాలు జగన్‌కు జై కొట్టారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయనేం చేస్తున్నారో చూస్తున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వంటివి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉన్నది. ఆ అవకాశం పవన్‌ పార్టీ లేదా ఇతర పార్టీలకు ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందే పొత్తుల కోసం పాలకులాడుతున్న పవన్‌ తానకు సీఎం కావాలనే కోరిక లేదని, ఆ పదవి వరించి రావాలి కానీ.. మనం కోరుకుంటే అయ్యేది కాదన్నారు. దీంతో పవన్‌ లక్ష్యం బాబు ను మళ్లీ సీఎం చేయడమే అన్నది స్పష్టమైంది. దీన్నిరాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జనసేన, బీజేపీ అంగీకరించినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారా? అన్న గ్యారెంటీ ఏమీ లేదు. అంతేకాదు పవన్‌ టీడీపీకి బీ టీమ్‌ అన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. రాజకీయాల్లో పవన్‌ నిలకడలేని నిర్ణయాలు ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ప్రజల ఆకాంక్షలు తొమ్మిదేళ్లైనా ఇప్పటికీ నెరవేరలేదు. ఈ వైఫల్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల పాత్ర ఉన్నది. కానీ పవన్‌ ఈ విషయాన్ని మరిచి తిరిగి బీజేపీ, టీడీపీ పొత్తులు పెట్టుకునేలా తాను కృషి చేస్తానని చెబుతుండటంపై ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. అందుకే వైసీపీ నేత సజ్జల పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ నీటి బుడగ అని,చంద్రబాబు పల్లకి మోయడమే ఆయన నైజం అని,బలం లేదని పవన్‌ అంగీకరించారని కౌంటర్‌ ఇచ్చారు. పొత్తులపై పవన్‌కు అంత తొందర ఎందుకో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



Monday, 9 August 2021

ఆ పార్టీలకు ఇక్కడ ఆదరణ ఉంటుందా?

 


ఒక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసే ప్రాంతీయ పార్టీ మ‌రో రాష్ట్రంలో మ‌నుగ‌డ సాగించ‌లేదు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం పేరు మీద టీడీపీ ఆవిర్భావించింది. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని దాదాపు రెండు ద‌శాబ్దాలు పాలించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా ఆ పార్టీ ప్ర‌భావం త‌గ్గిపోయింది. 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న‌ది. అయితే ఆ పార్టీ మూలాలు ఆంధ్ర‌లో ఉన్నాయి. అందుకే  2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీలో టీడీపీ అధికారంలోకి ఉండ‌టం, చంద్ర‌బాబు తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డంతో పార్టీ ఇక్క‌డ ఉన్నా ప్ర‌భావాన్నికోల్పోయింది. దాదాపు సీనియ‌ర్ నేత‌లంతా టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీల‌లో చేరిపోయారు. 


ఇప్పుడు ఆ పార్టీలో కొన‌సాగుతున్ననేత‌లు కొంత‌మంది మాత్ర‌మే. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో టీడీపీ త‌న అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోనున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉండి, అక్క‌డి ప్ర‌యోజ‌న‌ల కోసం ప‌నిచేస్తూ తెలంగాణ‌లో రాజ‌కీయం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే వాస్త‌వాన్ని బ‌హుశా జ‌గ‌న్ పార్టీ గ్ర‌హించి ఉంటుంది. అందుకే  ఒక్క తెలంగాణ‌లోనే కాదు ప‌క్క‌రాష్ట్రాల రాజ‌కీయాల‌లో వేలు పెట్ట‌మ‌ని క‌రాఖండిగా చెప్పారు. వైఎస్ ఆర్ తెలంగాణ‌కు కూడా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. ఆ పార్టీ అధినేత్రి ష‌ర్మిల కొన్నిరోజులుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు చూస్తే వారి ఆశ‌లు వ‌మ్ము అవుతాయే త‌ప్పా అధికారంలోకి రావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఎందుకంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటి విష‌యంలో వారు తెలంగాణ వైపే నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. రొటీన్ కామెంట్ల లెక్క రెండు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగ‌వ‌ద్ద‌నేదే మా పార్టీ విధానం అని స‌మ‌స్య‌ల‌ను దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన రెండు కండ్ల సిద్ధాంతం వంటిదే.  ఉమ్మ‌డి పాల‌కుల విధాన నిర్ణ‌యాల వ‌ల్ల‌నే తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో అన్యాయానికి, అణిచివేత‌కు గురైంది. అందుకే వారి పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడారు. ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌కులు అంటే వారి తండ్రి దివంగ‌త వైఎస్ పాల‌న‌ను కూడా తెలంగాణ వ్య‌తిరేకించారు. వారి తండ్రి అధికారంలో ఉన్న‌స‌మ‌యంలోనే ఉద్య‌మాన్ని అణిచివేసే, ఉద్య‌మ‌పార్టీలో చీలిక‌లు తెచ్చే అనేక కుట్ర‌లు చేశారు. ఇదంతా తెలంగాణ ప్ర‌జ‌ల అనుభ‌వంలో ఉన్న‌దే. ఇప్పుడు వైఎస్ కూతురు ష‌ర్మిల రాజ‌న్న రాజ్యం తెస్తామ‌న్న నినాదం తెలంగాణ‌లో ఫ‌లించ‌దు. 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఉద్య‌మ‌పార్టీనే అధికారంలోకి వ‌చ్చింది. ఉద్య‌మ స‌మ‌యంలో నినాదాల‌ను ఇక్క‌డి పాల‌నా విధానాల్లో చూపెట్ట‌లేదు.  ఇక్క‌డ ఉన్న అన్నిప్రాంతాల ప్ర‌జ‌లు మావాళ్లే అని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు భ‌ధ్ర‌త‌, భ‌రోసా క‌లిగించింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేసిన భ‌యాందోళ‌న‌ల‌ను తొలిగించింది. అందుకే ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో అన్నిప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణ‌మే ఉన్న‌ది. బాబు హ‌యాంలో సెక్ష‌న్ 8 పేరుతో రెండు రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల మ‌ధ్య అపోహ‌లు సృష్టించి, రాజ‌కీల ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌ల‌ను కూడా తెలంగాణ ప్ర‌భుత్వం చేధించింది. 


అయితే తెలంగాణ‌లో ఎవ‌రైనా పార్టీ పెట్ట‌వ‌చ్చు. విస్త‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌లను కోర‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ఏ పార్టీ మ‌న‌గ‌డ సాగించాలంటే తెలంగాణ సోయితోనే ప‌నిచేయాలి. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించాలి. ద్వంద్వ విధానాలు విడనాడాలి. అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌గ‌లుగుతారు. ఇవేవీ లేకుండా రాజ‌కీయాలు చేస్తామ‌ని అనుకుంటే వారి ఆశ‌లు అడియాశ‌లే అవుతాయ న్నది చరిత్ర చెప్తున్న సత్యం.

 

Thursday, 1 August 2013

ఆఖరి అస్త్రాలు



తెలంగాణ అనుకూల ప్రకటన వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్న లగడపాటి ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలంగాణ బిల్లును ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు లో ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ................................ నే ఉంటాడు. కాబట్టి లగడపాటి హార్డ్ కోర్ సమైక్యవాది అయిపోయాడు. ఇక ఇప్పుడు కొంత మంది సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ పదవులకు రాజీ'నామాలు' చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ రాజీనామాలతో వస్తే రాష్ట్రపతి పాలనే వస్తుంది తప్పా రాష్ట్ర విభజన పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. ఇదే విషయాన్నీ దిగ్విజయ్, షిండే లు చెప్పారు. నాలుగేళ్ళ కిందట నల్లారి,నారా వారు ఆడిన రాజీ డ్రామా లతో కేంద్రం వెనక్కి తగ్గింది. దాని ఫలితంగా కార్యకర్తలను  కాపాడుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి వేల కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అందుకే బాబు ఆ తప్పు మళ్ళీ చేయలేదు. కానీ విభజన పాపం బాబు, వైఎస్అర్ సీపీల పై కి నెట్టి లబ్ధి పొందాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేసిన వైఎస్అర్ సీపీ ఎమ్మెల్యేల 'రాజీ'నామాలు ఏమయ్యాయో తెలియదు. సీమాంధ్ర నేతల రాజీనామాల వెనుక ఉన్న స్టార్ బాట్స్ మెన్ ఎవరో అందరికి తెలుసు. లగడపాటి చెప్పిన ఆ బాట్స్ మెన్ హస్తినలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఇప్పటి రాజీనామాలు వారి ఆఖరి అస్త్రాలు. ఈ శుష్క యుద్ధం లో వాళ్ళు మీడియా ముందు హీరోలుగా కనబడినా...రాష్ట్ర విభజనపై కేంద్రం మనసు మారదు.

Tuesday, 9 July 2013

సత్తిబాబు సమైక్య సన్నాయి



రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకున్నానని చెప్పారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆయన ఆ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ సమైక్యాంధ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సులో ఊసరవెల్లి ఉండవల్లి తెలంగాణ ఉద్యమనాయకత్వంపై విషం చిమ్ముతుంటే ఆ వేదికను పంచుకొని నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడలేదు అన్నారు. అంతేకాదు ఆ సభలో తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారందరితో కలిసిపోయారు సత్తిబాబు. ఆయన ఆరోజు ఆ సభలో సమైక్యవాదాన్ని వినిపించకపోయినా ఆయన ఆంతర్యం మాత్రం అదేనని అప్పుడే అర్థమైంది. దీనిపై ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయనను నిలదీస్తే మీరు సభ పెట్టండి మీ సభకు వస్తాను అని తప్పించుకున్నాడు. అట్లాగే ఆమధ్య రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ తెలంగాణ అమరులకు నివాళులు అర్పించే సమయంలో బొత్స వ్యవహరించిన తీరు ఆయన తెలంగాణ వ్యతిరేకతను చూపెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మొత్తానికి ప్రాతినిధ్యం వహించాలి. కానీ రేపు ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేసేది సీమాంధ్ర ప్రాంతంలో. అంతేకాదు సత్తిబాబు కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలబడే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో సత్తిబాబు సమైక్య సన్నాయి నొక్కుతున్నారు.  ఒకవైపు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామంటూనే వైఎస్‌ఆర్‌సీపీ సీమాంధ్రలో రాజీనామాలకు తెరలేపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూనే విభజనకు అంగీకరించమని ‘గంట’లు మోగిస్తారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు చెప్పుకొస్తాడు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వాళ్లు కాగితాల మీద ఇచ్చే రోడ్డు మ్యాప్ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఊరుకోము అంటాడు. సాక్షాత్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునికే తెలంగాణ వ్యతిరేకత ఉంటే, ఇక మిగతా నేతలను ఆయన ఎలా కట్టడి చేస్తాడు? మా పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు అనే చంద్రబాబు మాత్రం తెలంగాణ విషయంలో ఆ షరతు వర్తించదు అంటాడు. సీమాంధ్ర బాబు చిత్రాలు ఈ నాలుగేళ్లలో ఈ ప్రాంత ప్రజలు చాలానే చూశారు. అందుకే ఇక తెలంగాణపై ఎన్ని నాటకాలు వేసినా ప్రయోజనం ఉండదు.

Saturday, 6 July 2013

పార్టీల నిర్ణయమే ప్రామాణికం

తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్‌ మ్యాప్‌లతో రమన్నాడు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌. ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్‌ అధిష్టానం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రెండోది సమైక్యాంధ్రాను కొనసాగిం చడం. ఈ రెండు వాదనల్లో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని వారి అభిప్రా యాలు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలకు చెప్పుకునే అవకాశం కార్య కర్త మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉన్న ది. వీరందరి అభిప్రాయాలను పరిగణలోకి హస్తినకు వెళ్తారు. అయితే రాష్ట్ర విభజనపై మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ఎన్నోమార్లు వివిధ కమిటీల ముందు, కాంగ్రెస్‌ అధిష్టాన పెద్దల ముందు వినిపించారు. మొన్న దిగ్విజయ్‌ వచ్చినప్పుడు కూడ ఇరుప్రాంతాల నుంచి తమ తమ అభిప్రాయాలతో కూడిన నివేదికలు ఇచ్చారు. అలాగే అందరి అభిప్రాయాలు అధిష్టాన పెద్దలకు విన్నవించి, రాష్ట్ర విభజనపై అన్ని ప్రాంతాల మనోభా వాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందరికి ఆమోదయో గ్యమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్యం తీసుకుంటుందని ఇప్పుడు విభజనపై మడత మాటలు మాట్లాడుతున్న నేతలంతా ఇంతకాలం చెప్పుకొచ్చినవే. ఈ రాష్ట్ర ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుంది. ఎప్పు డు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదానికి 270 స్థానాలు ఖాయమన్న లగడపాటి రాజగోపాల్‌ దాన్ని పక్కనపెట్టాడు. తనకున్న సమాచారం మేరకు మూడు నెలల్లో తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం కోరుతారని, అప్పుడు ఆ తీర్మానం వీరిపో యేలా చేయాలన్నారు. ఆ తీర్మానం వీరిపోతుందా లేక పాస్‌ అవుతుందా అనేది ఆంధ్రా ఆక్టోపస్‌కు అర్థం కావడం లేదు. అందుకే అప్పుడు ఆ తీర్మానం వీరిపోవాడానికి నలభైపైచిలుకు ఉన్న సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యవాదంపై గళం విప్పాలం టున్నాడు. తెలుగుతల్లి ముక్కలు కాకుండా ఉండాలంటే వాళ్లు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుందని తెగ ఆందోళనపడుతున్నాడు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్‌ సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు అధికార ప్రతినిధి అయిపోయాడు. అయా పార్టీల నేతలంతా తెలంగాణను వ్యతిరేకించాలంటున్నాడు. ఇంతకాలం రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితిలో జరగదన్న అగడపాటి ఇప్పుడు మా త్రం ఏం జరుగుతుందో చెప్పలేము అంటున్నాడు. దానిపై ఆయ నకు క్లారిటీ రావాలంటే అసెంబ్లీ తీర్మానం తర్వాత వస్తుందేమో! ఇక్కడే అగడపాటి రాజగోపాల్‌ ఒక విషయాన్ని మరిచిపోతున్నాడు. రాష్ట్ర విభజనపై వ్యక్తిగత అభిప్రా యాలు ఏవైన పార్టీల అభిప్రా యాలే అంతిమం అన్న ప్రాథమిక విషయాన్ని ఆయన మరిచిప తున్నాడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణకు తాము వ్యతిరే కం కాదు అన్న పార్టీల బలబలా లు చూస్తే ఆ బిల్లు సునాయసంగా పాస్‌ అవుతుంది. లేదు ఆ మాట అన్నది తమ రాజకీయ లబ్ధి కోసమే అంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇప్పుడు పక్క పార్టీల విషయాన్ని పక్కనపెడితే మీ ముఖ్య మంత్రి, పీసీసీ, డెప్యూటీ సీఎం రోడ్‌ మ్యాప్‌ల ఆధారంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో అమలు చేయాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమ అభిప్రాయాన్ని తెలియజేసి మిగతా పార్టీల అభిప్రాయాన్ని కోరవలసి ఉంటుంది. అంతేగానీ బడిత ఉన్న వాడిదే బర్రె అన్నట్టు సీమాంధ్ర ప్రాంతంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తామంటే తీర్మానం వీగిపోతుందేమో కానీ రాష్ట్ర విభజన మాత్రం ఆగదు. మెజరిటీ ప్రాంత ప్రతినిధులు తమకున్న బలంతో మైనరిటీ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుంటామంటే కుదరదు. ఇలాంటి పరిస్థితి ఉంటుం దనే రాజ్యాంగ నిర్మాతలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అందుకే మీ రాష్ట్ర వ్యవహారల పర్యవేక్ష కుడు దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండా ల్సిన పనిలేదు అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే రాజీనామాలు చేస్తాం. అగ్నిగుండం అవుతుంది అనే మాటలతో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. తెలంగాణ కోసం ఆ మధ్య కొంతమంది ఎంపీలు పార్టీకి డెడ్‌లైన్లు పెడితే, అధిష్టానానికి డెడ్‌లైన్లు పెట్టే సాహసం ఎవరూ చేయకూడదని ముఖ్యమంత్రి అన్న మాటలు రాజీనామాలు చేస్తాం అంటున్నవారు గుర్తించుకుంటే మంచిది. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కూడా తెలంగా ణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి. కాంగ్రెస్‌ హస్తిన పెద్దలు మొదలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి దాకా కేంద్రం దీనిపై చర్చలు జరుపుతున్నదని త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ నిర్ణయానికి అనేక గడువులు పెట్టి మాట మార్చారు కూడా. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. అందుకే డిగ్గీరాజా ఒక డెడ్‌లైన్లు ఉందవు నిర్ణయమే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ మాట నిజమో కాదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసుందామని ఆంధ్రప్రదేశ్‌ లోని బుద్ధిజీవులంతా కోరుకుంటున్నారు. అయితే నిర్ణయం రాకము ందే ఒక ప్రాంత ప్రజలు ఆకాంక్షపై ఒక వర్గం మీడియా, కొంత మంది వ్యక్తులు విషం చిమ్మడం సరికాదు. అలాగే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకూ కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు. కాంగ్రెస్‌ పార్టీ అన్నమాట ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమవుతుందనుకున్న ప్రతి తరుణంలో ఒక వర్గం మీడియా అడ్డుకోజూడటం ఇక్కడి ప్రజల్లో పెను ప్రభావమే చూపుతుంది. తెలంగాణపై పార్టీల నిర్ణయమే ప్రామాణికం. ఆయా పార్టీలు ఇక్కడ మన గలగాలంటే ఇప్పుడు అవి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Monday, 1 July 2013

ముందే కూస్తున్న కోయిలలు



ఈ మధ్య ఓ చానల్ తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతర్గం ఏమిటో ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. మినట్ టూ మినట్ అప్‌డేట్ అంటూ రకరకాల కథనాలు ప్రసారం చేసింది. విభజన ఖాయం అని తేల్చేసింది. ఇక నిర్ణయమే మిగిలింది అన్నట్టు సాగింది ఆ చానల్ హడావుడి. దీనిపై చర్చలు కూడా చేసింది. పైకి చూస్తే ఇదంతా ప్రజాహితం కోసం ఆ చానల్ తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అసలు కథ అది కాదు. తెలంగాణపై నిర్ణయం రాకుండా మళ్లీ సీమాంధ్రలో అగ్గిరాజేయడానికి చేసిన ప్రయత్నం అది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై మూడు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చింది. ఒకటి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమని, రాయల తెలంగాణ అని, ప్యాకేజీ అని రకరకాలుగా విశ్లేషణలు మొదలుపెట్టింది. తెలంగాణపై షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్షంలో ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు తెలంగాణకు జై కొట్టాయి. దీంతో ఇంత కాలం ఏకాభిప్రాయం అనే మాట మాట్లాడిన కాంగ్రెస్‌కు అఖిలపక్ష సమావేశం తర్వాత ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఆంధ్రా లాబీయింగ్ ఆజాద్ రూపంలో తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. కాంగ్రెస్ ఊతపదాలు మరిన్ని చర్చలు, విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటివి వచ్చాయి. షిండే పెట్టిన గడువుకు ఆజాద్ తాత్కాలికంగా గండికొట్టాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నెలలు గడిచినా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకుంటే ప్రజలు తిరగబడతారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక  లోక్‌సభ ఎన్నికలు కూడా నవంబర్‌లో జరగవచ్చు అనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న, యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో కీలక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని భావిస్తూ ఉండవచ్చు. అందుకే తెలంగాణపై ఇప్పటికే ఎన్నో మాటలు, ఎన్నో గడువులు పెట్టింది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది సత్యం. అందుకే ఇక తెలంగాణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. కేంద్రంలో కదలిక రాగానే ఆంధ్రా చానళ్ల, నేతల్లో ఆందోళన మొదలవుతుంది. హస్తిన పెద్దలు ఏ నిర్ణయం చెప్పకుండానే ఇక్కడ మాత్రం హడావుడి ప్రారంభమవుతుంది. ఇదే ప్రజాహితమని, మెరుగైన సమాజం కోసం ప్రజలను మభ్యపెడుతుంటాయి. నిజానికి రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కేంద్రం కూడా ఈ అంశంపై తేల్చాల్సిన సమయమూ ఆసన్నమైంది. అది ఏమిటో ఇంత వరకు అటు కాంగ్రెస్ పెద్దలు కానీ, ఇటు రాష్ట్ర పెద్దలు కానీ పెదవి విప్పడం లేదు. మరికొన్ని కోయిలలు ముందే ఎందుకు కూస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి.

అట్లాగే కావూరి సాంబశివరావు తెలంగాణపై మాటమార్చారని ప్రసారం చేస్తున్నాయి. కావూరి తెలంగాణ అనుకూల వ్యాఖ్యలేమీ చేయలేదు. ఇప్పుడు సమైక్యవాద నినాదం వినిపిస్తున్న నేతల మాటనే ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ హస్తిన పెద్దలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీ పడక తప్పదు అన్నారు. దీన్ని భూతద్దంలో చూపెడుతూ.... కావూరిని తెలంగాణకు అనుకూల వ్యక్తిగా, సమైక్యాంధ్రకు వ్యతిరేకిగా చిత్రిస్తున్నాయి. ఒక వర్గం కొమ్ము కాస్తున్న మీడియా చిత్తశుద్ధి ఉంటే 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు జైకొట్టి, డిసెంబర్ 10న మాట మార్చిన చంద్రబాబును నిలదీయాల్సి ఉండే. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెబుతూనే...  సీమాంధ్ర కాంగ్రెస్ నేత చేస్తున్న వితండవాదాన్ని తప్పుపట్టాల్సి ఉండే. కానీ ఇవేవీ చేయకుండా వాళ్ల కంటే ఒక అడుగు ముందుకేసి ఒక వర్గం మీడియా ప్రజల్లో లేని అపోహలను, విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు.

Thursday, 27 June 2013

ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే!

ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చంద్రబాబు తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించడానికి, వారిని వారి స్వస్థలాలను పంపించడానికి టీడీపీ అధినేత నాలుగైదు రోజులుగా నానా హడావుడి చేస్తూనే ఉన్నాడు. వరద బాధితులకు సౌకర్యాలు సరిగా లేవని ఏపీ భవన్ ముందు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నా కూడా చేశారు. అట్లాగే వరద బాధితులను రక్షించడంలో భారత సైన్యం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. ఇఎ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచకుపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ బురద రాజకీయం ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సైన్యాన్ని ప్రశంసిస్తూనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు అంటే ఏమనుకోవాలి? భారత సైన్యం ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుందో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన  చంద్రబాబుకు తెలియకపోవడం దురదృష్టకరం. మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అనే చంద్రబాబు వరద బాధితులను ఆదుకునే పేరుతో టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు బాహిబాహీకి దిగి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు. క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచే చంద్రబాబు ఆయన ముందే కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒకరినొకరు తోసేసుకుంటూ, నోటికొచ్చినట్టు తిట్టుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించాడు. ఇక అధికార పార్టీ నేతల గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పక్కవాడు లేస్తే గానీ మనకు చలనం రాదు అన్నట్టు ఉంటుంది కాంగ్రెస్ నేతల వైఖరి. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకుంటున్నామని రోజూ మీడియా ముందు ఫోజులు ఇచ్చుకుంటూ, క్రెడిబులిటీ కోసం ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టకునే దాకా వెళ్లారు. బాధితుల గోడు పక్కకు పోయి నిన్న రాష్ట్ర, జాతీయ మీడియాలో వీరి గొడవే ప్రధానాంశం అయింది. సహాయ చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతున్నది. సైన్యం బాధితులను రక్షించడానికి ఎంతో శ్రమిస్తున్నది. ఈ సమయంలో నేతలు పరామర్శల పేరుతో ఫైటింగులు చేసుకుంటే రాష్ట్రం పరువు గంగపాలు చేశారు.
ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే! కాంగ్రెస్, టిడిపి నేతలను చూసి జనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది.

Wednesday, 5 June 2013

దేశంలో రెండు దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ను అందిస్తున్నది ప్రాంతీయ పార్టీలే. అంటే ఒకరకంగా జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. కానీ నాగం జనార్దన్‌రెడ్డికి మాత్రం ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీగా కనిపిస్తున్నది. ఇదే జాతీయ పార్టీ దేశంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ బెదిరింపులకు లొంగి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. అంతెందుకు 2004లో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. ఆ ఎన్నికల్లో టీడీపీని తెలంగాణలో మట్టికరిపించింది ఉప ప్రాంతీయ పార్టీనే. అదే టీడీపీ 2009 ఎన్నికల్లో నాగం చెబుతున్న ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకున్న విషయం నాగం మరిచిపోయారేమో! తెలంగాణ కోసం ఎవరు ఏ పార్టీలో అయినా పనిచేయవచ్చు. కానీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు అనడమే వారి అవగాహన లోపానికి నిదర్శనం.
తెలంగాణపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే,  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు.,ఇక 2001లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ నాడు 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గరికి పంపారు. దశాబ్ద కాలంగా తెలంగాణ సమస్య కాంగ్రెస్ కోర్టులో ఉన్నది. ఇప్పుడు తెలంగాణపై భిన్న అభిప్రాయాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే. ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు చెబుతున్నట్టు సంప్రదింపులు, చర్చలు అనేకసార్లు జరిగాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార పార్టీలోనే ఏకాభిప్రాయాన్ని సాధించలేని వారు తెలంగాణ ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉన్నదనడం ఇప్పటి విషాదం. షిండే పెట్టిన ‘నెల’ గడువును తప్పుపట్టిన ఆజాద్ ఇప్పుడు మరో గడువు పెట్టినా, షకీల్ అహ్మద్ తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పినా అది వాళ్ల పార్టీ నేతలను కాపాడుకోవడానికే తప్పా ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మాత్రం కాదు. మీడియాలో వస్తున్నట్టు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టి ఆ ప్రక్రియ ప్రారంభించినప్పుడే దానికి విలువ ఉంటుంది. తెలంగాణఫై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న సాచివేత ధోరణిని నిరసిస్తూ పార్టీని వీడుతున్న నేతలను చూసి హస్తిన పెద్దలే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర మీడియా కూడా వలసలను కట్టడి చేసేందుకు పూటకో కథనాన్ని ప్రసారం చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలోపై హస్తినలో ఏదో జరుగుతున్నదనే హడావుడి.
ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి దశాబ్ద కాలం పూర్తయింది. అప్పుడు ఓట్లు పడ్డాయి. రెండు రాష్ట్రాలు మాత్రం ఏర్పడలేదు. మూడు కొత్త రాష్టాలు ఏర్పాటు చేసిన ఆ పార్టీకి తెలంగాణ ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ అంటున్నది. జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు చేయవచ్చు. కానీ ఆంధ్రలో అడుగుపెట్టదు. అక్కడి ప్రజాస్వామిక వాదులతో కలిసి ఉద్యమం చేయదు. ఇక్కడ మాత్రం ఉప ప్రాంతీయ పార్టీతో తెలంగాణ సాధ్యం కాదంటున్నది. అధికారంలో ఉన్నప్పుడు హాండ్ ఇచ్చి, ప్రతిపక్షంలో ఉండి హామీలు గుప్పిస్తున్నది. తెలంగాణపై టీఆర్‌ఎస్‌కు ఉన్న కమిట్‌మెంట్ మిగతా ఏ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ఆయా పార్టీలన్నీ ఆంధ్రా నాయకత్వంలో నడుస్తున్నవే. అందుకే ఆ పార్టీలకు తెలంగాణ అంశం అంత ప్రాధాన్యమైనది కాదు. ఇదే సీమాంధ్ర మీడియాకు కావలసింది. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొడితే ఆంధ్రా పార్టీలేవీ తెలంగాణ అంశం తెరమరుగవుతుందని వారి భావన. అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాటిని హైలెట్ చేయడం, అనుకూలంగా మాట్లాడితే హైడ్ చేయడం నాలుగేళ్లుగా చూస్తున్నదే.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...