Tuesday, 9 July 2013

సత్తిబాబు సమైక్య సన్నాయి



రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకున్నానని చెప్పారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆయన ఆ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ సమైక్యాంధ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సులో ఊసరవెల్లి ఉండవల్లి తెలంగాణ ఉద్యమనాయకత్వంపై విషం చిమ్ముతుంటే ఆ వేదికను పంచుకొని నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడలేదు అన్నారు. అంతేకాదు ఆ సభలో తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారందరితో కలిసిపోయారు సత్తిబాబు. ఆయన ఆరోజు ఆ సభలో సమైక్యవాదాన్ని వినిపించకపోయినా ఆయన ఆంతర్యం మాత్రం అదేనని అప్పుడే అర్థమైంది. దీనిపై ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయనను నిలదీస్తే మీరు సభ పెట్టండి మీ సభకు వస్తాను అని తప్పించుకున్నాడు. అట్లాగే ఆమధ్య రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ తెలంగాణ అమరులకు నివాళులు అర్పించే సమయంలో బొత్స వ్యవహరించిన తీరు ఆయన తెలంగాణ వ్యతిరేకతను చూపెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మొత్తానికి ప్రాతినిధ్యం వహించాలి. కానీ రేపు ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేసేది సీమాంధ్ర ప్రాంతంలో. అంతేకాదు సత్తిబాబు కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలబడే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో సత్తిబాబు సమైక్య సన్నాయి నొక్కుతున్నారు.  ఒకవైపు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామంటూనే వైఎస్‌ఆర్‌సీపీ సీమాంధ్రలో రాజీనామాలకు తెరలేపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూనే విభజనకు అంగీకరించమని ‘గంట’లు మోగిస్తారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు చెప్పుకొస్తాడు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వాళ్లు కాగితాల మీద ఇచ్చే రోడ్డు మ్యాప్ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఊరుకోము అంటాడు. సాక్షాత్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునికే తెలంగాణ వ్యతిరేకత ఉంటే, ఇక మిగతా నేతలను ఆయన ఎలా కట్టడి చేస్తాడు? మా పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు అనే చంద్రబాబు మాత్రం తెలంగాణ విషయంలో ఆ షరతు వర్తించదు అంటాడు. సీమాంధ్ర బాబు చిత్రాలు ఈ నాలుగేళ్లలో ఈ ప్రాంత ప్రజలు చాలానే చూశారు. అందుకే ఇక తెలంగాణపై ఎన్ని నాటకాలు వేసినా ప్రయోజనం ఉండదు.

No comments:

Post a Comment

Featured post

రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే

  https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....