Showing posts with label huzurabad by poll. Show all posts
Showing posts with label huzurabad by poll. Show all posts

Friday, 27 August 2021

పార్టీలు కాదు వ్యక్తులే ప్రధానమట

 హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో పార్టీలతో పనిలేదు. వ్యక్తులే ప్రధానం అంటున్నారు అంట ఆ నియోజకవర్గంలో ని ప్రజలు. ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మీరేం చేశారు అంటే మీరేం చేశారు అని విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రజల మనోగతం భిన్నంగా ఉన్నదని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఎన్నిచేసినా ఆ నియోజకవర్గంలోని ప్రజలతో ఈటల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత అనుబంధం ఫలితంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న పథకాలు ఏవీ పనిచేసేలా లేవు అంటున్నారు. ఈ ఉప ఎన్నిక వరకు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ వైపే ఉన్నారట. పార్టీ లతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయడం, పక్షపాతం చూపకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి ఈటల రాజేందర్ కు కలిసి వచ్చే అంశాలని ప్రజల అభిప్రాయం. అలాగే కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తాను అందించిన సేవలను అక్కడి ప్రజలు మననం చేసుకుంటున్నారు.


 ఈ నియోజకవర్గంలో పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నది. బహుశా అందుకే మొన్న కేటీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక మా ప్రభుత్వం కూలిపోదు అనే మాటలు మాట్లాడి ఉంటారు. 

ప్రస్తుతం హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులు ఇవి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం మొదలు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది నోటిఫికేషన్ వచ్చేవరకు తెలుస్తుంది. 

Wednesday, 25 August 2021

ఆ మాటల ఆంతర్యం!


హుజురాబాద్ ఉప ఎన్నిక తమకు చిన్న విషయం అంటున్న అధికార పార్టీ అగ్ర నాయకుల మాటల ఆంతర్యం ఏమిటి అన్నది వాళ్ళ క్యాడర్ కే అర్థం కావడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాల పై, కొంతమంది అధికారుల పై జరుగుతున్న వివక్షను ఈటల రాజేందర్ తన ప్రచారంలో ఎండగడుతున్నాడు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను రాజకీయ విశ్లేషకులు దిద్దుబాటు చర్యలు గానే భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు అని కేటీఆర్ వ్యాఖ్యలు, కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని ఆ నియోజకవర్గంలో కురిపిస్తున్న నిధుల, పదవుల వరాలతోఈటల నైతిక విజయం సాధించారు అంటున్నారు. 

ఈటల రాజీనామా ఫలితంగా దళితబంధు పథకం అమలు కోసం హుజురాబాద్ కు 2000 కోట్ల కేటాయింపు జరిగింది. ఇందులో 1200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఎస్ సీ, బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ ల పదవులు హుజురాబాద్ కే దక్కాయి. దళిత బంధు మాక్కూడా కావాలనే డిమాండు మేరకు టైమొస్తే బీసీ బంధు, మైనారిటీ, ఇతర బంధులు కూడా పెడుతామని కేసీఆర్ ప్రకటించారు. హుజురాబాద్ చిన్న ఉప ఎన్నిక అంటూనే.. అక్కడ ఇన్ని చేస్తున్నా.... ఏదో తేడా కొడుతున్నదనే అభిప్రాయం అధికార పార్టీ నేతల మాటలతోనే అర్థం అవుతోంది.

2014 తర్వాత రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నిక అయినా అలవోకగా గెలిచే అధికార పార్టీ దుబ్బాక ఫలితం తర్వాత జరిగిన అన్నీ ఎన్నికల్లో చమటోడుస్తున్నది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక అయితే కేసీఆర్ తో సహా అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ప్రభుత్వం, పార్టీలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇక నోటిఫికేషన్ వచ్చాక ఇంకా ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు.

Saturday, 14 August 2021

పార్టీల బీసీ బాట

 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితబంధు పథకం ప్రభావం ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ జనరల్ స్థానంలో ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ పాట పాడుతుండటం గమనార్హం. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఈటల రాజేందర్ ది బీసీ సామాజిక వర్గమే. టీ ఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీనే. ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ వాళ్ళు కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గుచూపుతారని అంచనా. ముఖ్యంగా కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. బహుజనవాదం వినిపిస్తున్న  బీఎస్పీ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నది. ఆ పార్టీ కూడా ఆ నియోజకవర్గంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కే సీటు కేటాయించవచ్చు.  ఇలా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక దాదాపు అన్ని పార్టీలును బీసీల వైపు మళ్లించింది. 


కేంద్రంలో ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అందులో ఎక్కువ శాతం ఓబీసీ లకే బెర్తులు దక్కాయి. యూపీలో గత ఎన్నికల్లో బీజేపీ ఈ ఓబీసీ ప్రయోగం తోనే మంచి ఫలితాలు సాధించిన విషయం విదితమే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీ ప్రయోగాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో హుజురాబాద్ ఇప్పుడు ఆ ప్రయోగానికి వేదిక అయ్యింది. పార్టీల రాజకీయ అవకాశవాదం ఎలా ఉన్నా బీసీలకు జనరల్ స్థానంలో ప్రాతినిధ్యం లభిస్తున్నది. 


మార్పు ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలె. అది రాష్ట్రంలో హుజురాబాద్ నుంచి ప్రారంభం కావడం మంచి పరిణామం అని బీసీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలన్నీ దాదాపు అగ్ర కులాల నాయకత్వంలోనే నడుస్తున్నది వాస్తవమని వారి వాదన. ఒక బలమైన పార్టీ అభ్యర్థి బీసీ కావడంతో మిగిలిన పార్టీలు కూడా బీసీ అభ్యర్థుల వైపే చూసే అనివార్యత ఇప్పుడు హుజురాబాద్ లో ఏర్పడింది. అందుకే అక్కడ అన్ని పార్టీలు బీసీ వాదాన్ని జపిస్తున్నాయి. 


Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...