Showing posts with label #PiyushGoyal #BJP #BJPTreasurer #ModiCabinet #NitinNabin #OnePersonOnePost #IndianPolitics #BreakingNews. Show all posts
Showing posts with label #PiyushGoyal #BJP #BJPTreasurer #ModiCabinet #NitinNabin #OnePersonOnePost #IndianPolitics #BreakingNews. Show all posts

Monday, 17 August 2026

పీయూష్‌ గోయల్‌కు బీజేపీలో కీలక బాధ్యత

 

  • మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా?

 న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరచర్చకు దారితీసింది. బీజేపీ అనుసరిస్తున్న ‘ఒక వ్యక్తి – ఒక పదవి’ అనే అనధికారిక విధానం నేపథ్యంలో గోయల్‌కు ఈ కీలక పార్టీ బాధ్యతలు అప్పగించడం.. త్వరలో జరగబోయే మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గోయల్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రోత్సహించిన ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ విధానం ప్రకారం సాధారణంగా ఒక నేత ఒకేసారి కీలకమైన ప్రభుత్వ, పార్టీ సంస్థాగత బాధ్యతలు రెండింటినీ నిర్వహించకుండా చూడటం ఆనవాయితీగా ఉంది. ఈ నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల శాఖను నిర్వహిస్తున్న గోయల్‌కు పార్టీ జాతీయ కోశాధికారి పదవి ఇవ్వడం.. ఆయన భవిష్యత్‌ మంత్రిపదవిపై ఊహాగానాలకు కారణమైంది. అయితే ఈ నియామకం కేవలం పార్టీ వ్యవహారాల్లో గోయల్‌ అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతోనూ జరిగి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కొనసాగుతున్న చర్చలకు గోయల్‌ నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి వాణిజ్య మంత్రిగా ఆయనను కొనసాగించడమా, లేక పార్టీ బాధ్యతలకు పూర్తిస్థాయిలో కేటాయించడమా అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. పీయూష్‌ గోయల్‌ కుటుంబానికీ బీజేపీ కోశాధికారి పదవితో అనుబంధం ఉంది. ఆయన తండ్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కూడా రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ జాతీయ కోశాధికారిగా పనిచేశారు. గతంలో పీయూష్‌ గోయల్‌ కూడా పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు.


 


  • ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ విధానానికి మినహాయింపులు


అయితే బీజేపీ ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ విధానానికి మినహాయింపులు కూడా ఉన్నాయి. మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందుకు ప్రధాన ఉదాహరణ. 2020లో బీజేపీ అధ్యక్షుడైన నడ్డా పదవీకాలం 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పొడిగించబడింది. ఆ తర్వాత ఆయన మోడీ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖతో పాటు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా కొంతకాలం పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగారు. 2026 జనవరిలో నితిన్‌ నబిన్‌ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో నడ్డా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో అవసరాన్ని బట్టి పార్టీ తన విధానానికి మినహాయింపులు ఇవ్వగలదన్న విషయం స్పష్టమవుతోంది.






ఇదిలా ఉంటే, నితిన్‌ నబిన్‌ నేతృత్వంలో సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ బృందంలో పలువురు ప్రముఖ నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర సంస్థాగత వ్యవస్థలోకి తిరిగి వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి రామ్‌ మాధవ్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా తిరిగి కీలక బాధ్యతలు చేపట్టారు. మాజీ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, బైజయంత్‌ పాండా, రేఖా వర్మ, తారిఖ్‌ మన్సూర్‌ తదితరులు జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతుండగా, బీఎల్‌ సంతోష్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా కొనసాగుతున్నారు. అనిల్‌ ఆంటోనీ జాతీయ కార్యదర్శిగా, అనిల్‌ బలూనీ జాతీయ మీడియా బాధ్యతల్లో కొనసాగుతున్నారు.


వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పీయూష్‌ గోయల్‌ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాణిజ్య చర్చలు, పెట్టుబడులు, ఎగుమతులు, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆయన ఆధ్వర్యంలో భారత్‌ యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ సహా పలు దేశాలు, ఆర్థిక వ్యవస్థలతో తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసింది. అలాంటి కీలకమైన కేంద్ర మంత్రిని పార్టీ సంస్థాగత వ్యవస్థలోకి తీసుకురావడం సాధారణ నియామకమేనా, లేక భవిష్యత్తులో కేబినెట్‌ మార్పులకు సంకేతమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గోయల్‌ ఆర్థిక, ఎన్నికల నిర్వహణ, సంస్థాగత వ్యవహారాల్లో ఉన్న అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవాలని భావించి ఉండవచ్చు. మరోవైపు ప్రభుత్వ, పార్టీ బాధ్యతలను వేరు చేయాలనే ఉద్దేశంతో ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించి ఉండే అవకాశమూ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


 


  • కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు


మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల ముందు ఈ చర్చ మరింత ఊపందుకుంది. ప్రతిపక్షాల ఆందోళనలు, నీట్‌ అంశంపై యువత నుంచి వచ్చిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు వచ్చిన డిమాండ్లు వంటి కారణాలతో కేబినెట్‌ మార్పు వాయిదా పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.తాజా బీజేపీ సంస్థాగత నియామకాలతో మరోసారి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది.

Featured post

పీయూష్‌ గోయల్‌కు బీజేపీలో కీలక బాధ్యత

  మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా?  న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియ...