శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోషల్), కృష్ణ సార్ (సైన్స్) , సుబ్బారావు సార్ (ఇంగ్లీష్) చెప్పేవారు. మిత్రుడు మోహన్ అప్పుడు సింగరేణి హైస్కూల్ చదువుతున్నాడు. తను కూడా మా ట్యూషన్‌కు వచ్చేవాడు. అట్లా పరిచయం అయ్యాడు. 90వ దశకంలో మొదలైన మా స్నేహం రెండు దశాబ్దాలకు పైగా బలమైన స్నేహబంధంగా మారింది. ఎట్లా అంటే ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా అన్నదమ్ముల లెక్క ఉండేటోళ్లం. స్నేహం అంటే ఏమిటి అని అడిగితే మిత్రుడు మోహన్ పేరు చెప్పవచ్చు. అంటే దోస్త్ కోసం ఏమైనా చేస్తే మనస్తత్వం అతనిది.
పదవ తరగతి పూర్తయ్యాక నేను స్విస్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయితే తను బహుశా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిండు అనుకుంటా. గోదావరిఖని డిగ్రీ కాలేజీలోనే డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. కేయూ క్యాంపస్‌లో ఎంఈడీ చదివాడు. చదువుకునే రోజుల్లో మోహన్ శివ సినిమాలో నాగార్జున లెక్కనే ఉండేటోడు. చాలా కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించాడు. 2007 లో నేను ఎంబీఏ చేద్దామని టైమ్స్‌లో కోచింగ్ తీసుకున్నాను. నాకు వచ్చిన ర్యాంక్‌కు మేనేజ్‌మెంట్ సీటు తప్ప మెరిట్‌లో సీట్ వచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడు మిత్రుడు రవీంద్ రెడ్డి ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు. మా అన్న శ్రీనివాస్ కూడా మేనేజ్ మెంట్‌లో ఎంబీఏ చేయిద్దామని అవ్వను ఒప్పించాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను డిస్టెన్స్ లో ఎంబీఏలో జాయిన్ అయి జర్నలిజం వైపు అడుగులు వేశాను. ఈ మధ్య కాలంలో మోహన్‌ను దసరా లేదా ఎప్పుడైనా గోదావరిఖనికి వెళ్లినప్పుడు కలిసేవాడిని. మిత్రులమంతా సాయంత్రం పూట ముచ్చట్లు పెట్టుకోవడానికి చౌరస్తాలోని పోచమ్మ గుడి అడ్డా మారింది. దీనికి కారణం మోహన్. కాలక్రమేణా 'పోచమ్మ అడ్డా ఫ్రెండ్స్' వాట్సప్ గ్రూప్ అయ్యింది.
వృత్తి రీత్యా హైదరాబాద్ లో పనిచేయడం వల్ల గోదావరిఖనికి వెళ్లే సందర్భాలు సంవత్సరంలో రెండు మూడు సార్ల కంటే ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఎప్పుడు వెళ్లినా టైంకు అవ్వ అన్నం పెడితే ఉన్న రెండు మూడు రోజులు మా కోసం మోహన్ సమయం కేటాయించేవాడు. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. జీవితంలో కష్టాలకు ఎదురీదిన వాడు మోహన్. అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఉండేవాడు. మొబైల్ ఫోన్లు వచ్చాక మిత్రులం అప్పుడప్పుడు చాటింగో లేదా కాల్స్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. కాలం గిర్రున తిరిగి 2020 కి చేరింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ అనేక కుటుంబాల్లో అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఆ సమయంలో ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అన్నట్లు ఉండేది. ఎందుకంటే కొవిడ సృష్టించిన విపత్తు అందరినీ భయపెట్టింది. మొదటిసారి లాక్ డౌ న్ పెట్టడం వల్ల, జనాలు అప్రమత్తంగా ఉండటం వల్ల కొవిడ్ ప్రభావం మన దగ్గర తక్కువే కనిపించింది. కానీ 2021 నవంబర్ నాటికి సుమారు 179 దేశాలకు విస్తరించిన డెల్టా వేరియంట్ చాలామందిని కబళించింది.
కొవిడ్ కాలంలోనే మిత్రుడు మోహన్ ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఆ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇంటి కోసం బోర్ వేసినప్పుడు దోస్తులందరూ పోయారు. కానీ నాయనకు బియ్యం ఇవ్వడం వల్ల వెళ్లలేదు. కానీ తర్వాత వెళ్లి చూశాం. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చాడు. బేస్ మెంట్ కోసం కందకాలు తవ్వారు చూసి వద్దాం పదా అన్న అన్నాడు. అప్పటికే మిత్రుడికి దగ్గు వస్తున్నది. అవ్వ చాయ్ తీసుకొచ్చింది. అవ్వ నాకు దగ్గు వస్తున్నది వద్దులే అన్నాడు. కొంచెమే పోసిన బిడ్డ తాగు అన్నది. ఇద్దరం తాగి వెళ్లాం. అదే చివరి రోజు తనను చూడటం. మిత్రుడు మోహన్ కూడా కొవిడ్ బారిన పడ్డాడు. రాత్రి ఇబ్బంది ఎక్కువ కావడంతో గౌడ రవి అన్న, ఓదెలు అన్న గవర్నమెంట్ దవాఖానలో జాయిన్ చేశారు. పరిస్థితికి కొంచెం క్రిటికల్‌గా ఉండటంతో డాక్టర్ కరీంనగర్‌కు రిఫర్ చేశాడు. చెల్మడ లో జాయిన్ అయిన మిత్రుడు మోహన్ మధ్యలో ఒక్కసారి ఫోన్‌లో మాట్లాడాడు. ఎలా ఉన్నావంటే ఇప్పటికైతే ఓకే అన్నాడు. నిజానికి కొవిడ్‌కు మందు లేదు. ధైర్యమే పెద్ద మెడిసిన్. మిత్రుడు మోహన్ కోలుకుని త్వరగా వస్తాడుకున్నాం. కానీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాక రెండు మూడు రోజుల తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని మిత్రుడు శంకర్ రెడ్డి చెప్పాడు. ఆ సమయంలో కాక శంకర్ రెడ్డి మోహన్‌ను పర్యవేక్షించాడు. ఒకరోజు సాయంత్రం నాటికి పరిస్థితి సిరియస్ గా ఉందని సమాచారం వచ్చింది. ఆ రాత్రి గడిస్తే మోహన్‌కు ఏమి కాదనుకున్నాం. కానీ ఏ వార్త అయితే వినకూడదని అనుకున్నానో పొద్దున 2-3 గంటల సమయంలో భవ్య నుంచి ఫోన్ వచ్చింది. అన్నా మనకు లేడు అని చెప్పింది. ఆ సమయంలో నిశ్శబ్దం ఆవరించింది. మిత్రులు మోహన్ ఇక లేడు అన్న నిజానికి జీర్ణించుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో మేమంతా కలిసే పోచమ్మ అడ్డ దగ్గరికి వెళ్లిన సందర్భాలూ అరుదే. తను గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కళ్లు కన్నీళ్ల రూపంలో స్పందిస్తాయి. మార్చి 4న మిత్రుడి జయంతి సందర్భంగా గ్రూపులో అందరూ గుర్తుచేసుకున్నారు. నేను ఇలా అక్షరాల్లో మరోసారి జ్ఞాపకం చేసుకున్నాను. మిస్ యూ మోహన్ ... లవ్ యూ మై డియర్ ప్రెండ్.


No comments:
Post a Comment