Friday, 17 April 2026

హార్ముజ్ జలసంధి 'పూర్తిగా ఓపెన్'


  • కానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కొత్త కొర్రీలు!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినప్పటికీ, అక్కడి శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) తాజాగా కొన్ని కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ జలసంధిని తెరిచినట్లు విదేశాంగ మంత్రి ప్రకటించగా, ఐఆర్జీసీ మాత్రం ఇది తమ పూర్తి నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేస్తూ 'కొత్త నిబంధనలను' ప్రకటించింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇరాన్ అంతర్గత విభేదాలను , గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితిని ప్రతిబింబిస్తున్నాయి.



ఐఆర్జీసీ విధించిన కొత్త నిబంధనల ప్రకారం, యుద్ధంలో పాల్గొనని దేశాల వాణిజ్య నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి నౌక తప్పనిసరిగా ఇరాన్ నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించాలని, ప్రయాణానికి ముందు ఇరాన్ నౌకాదళం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా, యుద్ధ నౌకలకు ఈ జలసంధి ద్వారా ప్రవేశం ఉండదని కరాకండిగా చెప్పేసింది. అరాగ్చీ చేసిన 'కంప్లీట్లీ ఓపెన్' ప్రకటనను ఐఆర్జీసీ , ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి మాత్రమే జలసంధి నిర్వహణ ఉంటుందని, సోషల్ మీడియా ప్రకటనలతో కాదని వారు స్పష్టం చేశారు.


మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంపై స్పందిస్తూ, జలసంధి తెరుచుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం మాత్రం 'పూర్తి స్థాయిలో' కొనసాగుతుందని, తమతో కుదిరే ఒప్పందం 100 శాతం పూర్తయ్యే వరకు ఇది ఉండనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్  ఈ రెండు రకాల ప్రకటనలు , అమెరికా హెచ్చరికల మధ్య, అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఇంకా ధైర్యం చేయడం లేదు. భద్రతా హామీలు స్పష్టంగా లేకపోవడంతో సరుకు రవాణా పునఃప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.

No comments:

Post a Comment

Featured post

ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే ప్రాణం

  పరిశుభ్రమైన, నవీకరించిన ఓటర్ల జాబితా అవసరమన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిశుభ్రమైన, ఎప్పటికప్పుడు నవీకరించబడిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాని...