- కేరళలో కాంగ్రెస్ వైపు మొగ్గు
- తమిళనాట విజయ్ సంచలనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.దీంతో వెలువడిన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం.. రెండు పార్టీలు దాదాపు 145 స్థానాల వద్ద సమంగా నిలిచే అవకాశం ఉందని అంచనా. పీ-మార్క్ వంటి సంస్థలు బీజేపీకి 150-175 స్థానాలతో మెజారిటీని ఇస్తుండగా, పీపుల్స్ పల్స్ మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకే 177-187 స్థానాలతో అధికారాన్ని కట్టబెట్టింది. దీంతో బెంగాల్ పీఠం ఎవరిదనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అటు కేరళలో పదేళ్ల ఎల్డీఎఫ్ (LDF) పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) తిరిగి పుంజుకోనుందని దాదాపు అన్ని సర్వేలు ఏకగ్రీవంగా పేర్కొన్నాయి. యాక్సిస్ మై ఇండియా యూడీఎఫ్‌కు 78-90 స్థానాలను అంచనా వేసింది. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అయితే, రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన నటుడు విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో భారీ ప్రభావాన్ని చూపుతారని, కొన్ని సర్వేల ప్రకారం ఆయన పార్టీ ఏకంగా 98-120 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని అంచనా వేయడం విశేషం.
ఈశాన్య రాష్ట్రం అసోంలో మాత్రం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యతతో మూడోసారి అధికారాన్ని దక్కించుకోబోతోందని సర్వేలు వెల్లడించాయి. ఎన్డీయే కూటమికి 88-100 స్థానాలు రావచ్చని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమికే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మే 4వ తేదీన వెలువడే అధికారిక ఫలితాలతో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తేలనున్నది.
No comments:
Post a Comment