- నేడే అతిపెద్ద వైమానిక దాడులు
- యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ సంచలన హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధ మేఘాలుగా మారుతున్నాయి. ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్, నేడు ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీస్థాయిలో వైమానిక దాడులు నిర్వహించబోతున్నామని హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న ఇరాన్ చర్యలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన కుండబద్దలు కొట్టారు. వైట్ హౌస్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ దాడుల వ్యూహం ఇప్పటికే సిద్ధమైందని, ఇది ఇరాన్ రక్షణవ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని హెగ్‌సెత్ పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా చేస్తున్న ఈ యుద్ధ ప్రకటన అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అల్లాడుతుండగా, ఇప్పుడు పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం మొదలైతే చమురు ధరలు పెరగడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా యుద్ధ కార్యదర్శి నేరుగా ఈ స్థాయి హెచ్చరికలు చేయడం ఇరాన్-అమెరికా సంబంధాల్లో అత్యంత కీలకమైన మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు , సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, ఆ దేశం కూడా తమ రక్షణ దళాలను సర్వసన్నద్ధం చేసినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment