- పశ్చిమ జిల్లాల ప్రభంజనం.. వెనుకబడిన దక్షిణాది
- భారీగా పెరిగిన చెన్నై ఓటింగ్ శాతంపై సర్వత్రా ఆసక్తి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ లేని విధంగా చారిత్రాత్మక తీర్పును ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 85.15 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2021 ఎన్నికల కంటే 11.4 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు, దాదాపు 70 లక్షల పేర్ల తొలగింపు, 30 లక్షల కొత్త ఓటర్ల చేరిక ఈ ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడులో ఓటర్లు పోటెత్తారు. కరూర్ (92.63%), సేలం (90.76%), నామక్కల్ (90.21%) జిల్లాలు అగ్రస్థానంలో నిలవగా, కరూర్ , వీరపాండి నియోజకవర్గాల్లో ఏకంగా 93.4 శాతం ఓటింగ్ నమోదై ఎన్నికల రికార్డులను తిరగరాశాయి.
ఒకప్పుడు ఓటింగ్‌లో వెనుకబడి ఉండే రాజధాని చెన్నై ఈసారి విస్మయపరిచే ఫలితాన్ని ఇచ్చింది. గతంలో 59.7 శాతంగా ఉన్న చెన్నై ఓటింగ్, ఈసారి 83.74 శాతానికి పెరగడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, దక్షిణ జిల్లాలైన కన్యాకుమారి (75.61%), శివగంగ (76.66%) ,రామనాథపురం (77%) రాష్ట్ర సగటు కంటే తక్కువ ఓటింగ్‌ను నమోదు చేశాయి. పళయంకోట్టై నియోజకవర్గంలో అత్యల్పంగా 68.97 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ శాతంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు చేసుకుంటున్నాయి.
అధికార డీఎంకే ఈ రికార్డు ఓటింగ్‌ను ప్రభుత్వ పథకాలకు లభించిన మద్దతుగా అభివర్ణిస్తుండగా, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే దీనిని ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొంటోంది. ఇక నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ, యువత , పట్టణ ఓటర్ల మార్పు కోసమే ఈ స్థాయిలో ఓటు వేశారని, విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. డెల్టా , పశ్చిమ ప్రాంతాల్లో తాము బలమైన పట్టు సాధించామని డీఎంకే భావిస్తుండగా, ఉత్తర , దక్షిణ జిల్లాల్లో తాము పుంజుకున్నామని ఏఐఏడీఎంకే ధీమాగా ఉంది. మే 4న వెలువడనున్న ఫలితాలు ఈ చరిత్రాత్మక ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుందో తేల్చనున్నాయి.
No comments:
Post a Comment