- మా దగ్గరే అన్ని దారులు ఉన్నాయి
- ఇరాన్‌తో చర్చల కోసం పాక్ వెళ్లాల్సిన ప్రతినిధి బృంద పర్యటనను రద్దు చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ,ఇరాన్ మధ్య శాంతి చర్చల ప్రక్రియలో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రతినిధులతో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన తన ఉన్నతస్థాయి ప్రతినిధి బృంద పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. తన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ ప్రయాణానికి సిద్ధమవుతుండగా, చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఏమీ సాధించలేని నిరర్థక చర్చల కోసం 18 గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తన సిబ్బందికి స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలను ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వివరించారు. ప్రస్తుతం అమెరికా దగ్గరే అన్ని అవకాశాలు ఉన్నాయని, ఇరాన్ నాయకత్వం తీవ్రమైన అంతర్గత విభేదాలతో సతమతమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో అసలు ఎవరి మాట చెల్లుతుందో వారికే తెలియడం లేదని ఎద్దేవా చేసిన ట్రంప్.. ఒకవేళ చర్చలు జరపాలనుకుంటే ఇరాన్ ఎప్పుడైనా తమకు నేరుగా ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. అదే సమయంలో, ఈ పర్యటన రద్దు చేసినంత మాత్రాన మళ్లీ యుద్ధం మొదలవుతుందని అర్థం కాదని, శాంతి కోసం తాము వేచి చూస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం అప్పటికే ఇస్లామాబాద్‌లో పాక్ నాయకత్వంతో భేటీ అయ్యి, అమెరికాకు తమ డిమాండ్ల జాబితాను అందజేసి తిరిగి వెళ్లిపోయింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపడానికి ఇరాన్ సుముఖత చూపకపోవడం కూడా ట్రంప్ నిర్ణయానికి ఒక కారణంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ,ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఈ పరిణామంతో తాత్కాలికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరాన్ ప్రతినిధులు ఒమన్, రష్యాలకు బయలుదేరారు.
No comments:
Post a Comment