- భారత్ తీవ్ర దిగ్భ్రాంతి..
- దోషులను కఠినంగా శిక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ:దక్షిణ లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంపై జరిగిన ఘోర దాడిని భారతదేశం శనివారం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో విధి నిర్వహణలో ఉన్న ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ, ప్రాణాలు కోల్పోయిన 'బ్లూ హెల్మెట్' సైనికుడికి ఘన నివాళులు అర్పించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఐక్యరాజ్యసమితి శాంతి దళాల భద్రతను కాపాడవలసిన బాధ్యత అన్నివర్గాలపై ఉందని స్పష్టం చేసింది. శాంతి పరిరక్షకులపై జరిగే నేరాలకు బాధ్యత వహించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం 2589ను భారత్ ముందుండి నడిపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.లెబనాన్ ప్రభుత్వం ఈ ఘాతుకంపై తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని భారత్ కోరింది. ఐక్యరాజ్యసమితి ప్రాంగణాలు, సిబ్బంది పవిత్రతను గౌరవించడం అత్యవసరమని, శాంతి కోసం పనిచేసే సైనికులకు రక్షణ కల్పించాలని అన్నిపక్షాలను విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మోహరించిన శాంతి దళాలపై ఇటువంటి దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని, దీనికి జవాబుదారీతనం అవసరమని భారత్ తన ప్రకటనలో పునరుద్ఘాటించింది.
No comments:
Post a Comment