Monday, 13 April 2026

మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు

  • మా పోర్టులకు ముప్పు వాటిల్లితే
  • మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు
  • ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా ఐఆర్‌జీసీ హెచ్చరిక
  • మళ్ళీ నిలిచిపోయిన నౌకల రాకపోకలు 
  • సోమవారం నుంచే దిగ్భంధం అమల్లోకి వచ్చిందన్న అమెరికా
  • హార్ముజ్‌ సెగతో వణుకుతున్న ప్రపంచ దేశాలు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్‌ జలసంధిపై దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ అత్యంత శక్తివంతమైన హెచ్చరికను జారీ చేసింది. పశ్చిమాసియాలోని నౌకాశ్రయాల భద్రత అనేది "అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండకూడదు" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ పోర్ట్ కూడా సురక్షితంగా ఉండబోదని ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా హెచ్చరించింది. తమ ప్రాంతీయ జలాల్లో సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించడం ఇరాన్ జాతీయ హక్కు అని, శత్రు దేశాలకు చెందిన ఏ నౌకనూ ఈ మార్గం గుండా వెళ్లనివ్వబోమని టెహ్రాన్ తేల్చి చెప్పింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇది ఒక రకమైన సముద్రపు దొంగతనమని ఇరాన్ మండిపడింది.



ఇరాన్‌ ఆదాయాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ట్రంప్‌ వ్యూహం

మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దిగ్బంధం సోమవారం సాయంత్రం నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఇరాన్ ఓడరేవులకు వచ్చే , అక్కడి నుంచి వెళ్లే అన్ని దేశాల నౌకలను అడ్డుకుంటామని అమెరికా సైన్యం వెల్లడించింది. అయితే, ఇరాన్ యేతర పోర్టుల మధ్య ప్రయాణించే నౌకలకు జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొనడం ద్వారా తన పాత నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి  'డార్క్' ట్రాన్సిట్‌ల ద్వారా ఇరాన్ మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోందని, ఆ ఆదాయాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ట్రంప్ ఈ దిగ్బంధం వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.


చమురు ధరలను మరింత పెరిగే అవకాశం

పాకిస్తాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా మారింది. అణు కార్యక్రమాన్ని వదులుకోవాలన్న అమెరికా నిబంధనలను ఇరాన్ తిరస్కరించగా, తమపై జరిగిన దాడులకు నష్టపరిహారం చెల్లించాలని, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో, తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో పునరుద్ధరించబడిన పరిమిత నౌకల రాకపోకలు మళ్ళీ నిలిచిపోయాయి. యుద్ధానికి ముందు రోజుకు 135 వరకు ఉండే నౌకల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. ఈ తాజా ప్రతిష్టంభన ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను మరింత పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు

మా పోర్టులకు ముప్పు వాటిల్లితే మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా ఐఆర్‌జీసీ హెచ్చరిక మళ్ళీ నిలి...