- గడువు ముగుస్తున్న వేళ ట్రంప్ అనూహ్య నిర్ణయం
- యుద్ధం కంటే దౌత్యానికి ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి
- ఈలోగా సరైన స్పందన రాకపోతే తిరిగి దాడులు తప్పవని హెచ్చరిక
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన,అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు బుధవారం తెల్లవారుజామున ముగియాల్సి ఉండగా, దాన్ని మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్ నాయకత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాల దృష్ట్యా స్పష్టమైన , ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు వచ్చేందుకు ఇరాన్‌కు మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం కంటే దౌత్యానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, అయితే ఇరాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఈ అదనపు గడువులోగా ఇరాన్ నుంచి సరైన స్పందన రాకపోతే, తిరిగి దాడులు ప్రారంభించేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ అగ్రనాయకత్వంలోని రాజకీయ, సైనిక విభాగాల మధ్య చర్చల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో వైట్ హౌస్ ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ వంటి సంస్కరణవాదులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తుండగా, ఐఆర్‌జీసీ కమాండర్లు మాత్రం వెనక్కి తగ్గేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఈ అనిశ్చితిని గమనించిన ట్రంప్, ఇరాన్ ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపాదనను సిద్ధం చేసుకునేందుకు వీలుగా గడువును పొడిగించారు. ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. చమురు ధరల పెరుగుదల ,ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ పొడిగింపు ఎంతో దోహదపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ నేతృత్వంలోని బృందం ఏ క్షణమైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్ కూడా ఈ అదనపు సమయాన్ని ఉపయోగించుకుని తన ప్రతినిధి బృందాన్ని ఇస్లామాబాద్‌కు పంపే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. అణు కార్యక్రమం, నౌకాయాన భద్రత ,ఆర్థిక ఆంక్షల తొలగింపు వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి యుద్ధ ప్రమాదం తప్పినప్పటికీ, ఇరాన్ ఇచ్చే ప్రతిపాదనపైనే ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉంది.
No comments:
Post a Comment