Friday, 3 April 2026

నడిరాత్రి వేళ కంపించిన రాజధాని


  • ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో 5.9 తీవ్రతతో భారీ భూకంపం
  •  ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
  • ఉత్తర భారతం అంతటా కనిపించిన ప్రభావం


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలను (NCR) శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. సుమారు 10 నుంచి 15 సెకన్ల పాటు భూమి బలంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. భవనాలు, ఫ్యాన్లు ,ఇంట్లోని వస్తువులు వేగంగా కదలడంతో ప్రాణభయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి.



భూకంప కేంద్రం భూ అంతర్భాగంలో కొంత లోతులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇంతటి భారీ తీవ్రతతో భూమి కంపించినప్పటికీ, ఇప్పటివరకు ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు అందలేదు. అయితే, ఎత్తైన భవనాల్లో నివసించే వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఇందులో భవనాలు ఊగడం ,ప్రజలు రోడ్లపై గుమిగూడటం కనిపిస్తోంది. భూకంపం సంభవించిన తర్వాత కూడా ప్రజలు భయంతో చాలా సేపటి వరకు ఇళ్లలోకి వెళ్ళడానికి సాహసించలేదు. పరిస్థితిని గమనిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన భూకంపం తర్వాత చిన్నపాటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ నగరం భూకంపాల పరంగా అత్యంత సున్నితమైన 'జోన్-4' లో ఉండటం వల్ల ఇలాంటి ప్రకంపనలు తరచుగా ఆందోళన కలిగిస్తుంటాయి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

పాడాలనే ఉంది.. కానీ వినికిడి శక్తి సహకరించట్లేదు

రెండేళ్ల తర్వాత తన దీనస్థితిని వివరించిన లెజెండరీ సింగర్ అల్కా యాగ్నిక్ సంగీత దర్శకులు పిలుస్తున్నా వెళ్లలేని పరిస్థితి భావోద్వేగానికి గురైన...