Saturday, 4 April 2026

అమెరికా పైలట్ దొరికాడు

  •  ఇరాన్ గడ్డపై ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్


పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కూల్చివేసిన అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానంలో గల్లంతైన సిబ్బందిలో ఒకరు ప్రాణాలతో లభించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా జెట్ కూలిపోయిన తర్వాత, అందులోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ (WSO) సురక్షితంగా రక్షించబడినట్లు మాజీ అమెరికా ప్రత్యేక దళాల అధికారి, జర్నలిస్ట్ జాక్ మర్ఫీ వెల్లడించారు. శత్రువుల కళ్లుగప్పి అడవుల్లో తప్పించుకుంటూ తిరుగుతున్న సదరు అధికారిని, భారీ కాల్పుల మధ్య అమెరికా బలగాలు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్ దళాలు , స్థానిక గిరిజన తెగలు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో, అమెరికా నిర్వహించిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. అల్ జజీరా కథనం ప్రకారం, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో జరిగిన భీకర పోరాటం తర్వాతే ఆయన్ని రక్షించడం సాధ్యమైంది.



అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్ అంత సులభంగా ఏమీ సాగలేదు. గల్లంతైన అధికారిని పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడంతో, స్థానిక బక్తియారీ తెగకు చెందిన సాయుధ గిరిజనులు పర్వత ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు జరుపుతున్న అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై వారు కాల్పులు జరిపినట్లు సమాచారం. గాలింపు చర్యల నేపథ్యంలో ఇరాన్, అమెరికా బలగాల మధ్య తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ ఇప్పటికే కూలిపోయిన విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. ప్రస్తుతం రక్షించబడిన అధికారి సురక్షితంగా ఉన్నప్పటికీ, దీనిపై అమెరికా ప్రభుత్వం గానీ, పెంటగాన్ గానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ, ప్రస్తుతానికి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు.


No comments:

Post a Comment

Featured post

కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి

 కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం కీవ్: రష్యా-ఉ...