Saturday, 25 April 2026

నేను నరేంద్ర మోడీకి భయపడను


  • 24 గంటలూ నన్నే టార్గెట్ చేస్తున్నారు
  • రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
  • బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీలపై నిప్పులు

దక్షిణ 24 పరగణాలు (పశ్చిమ బెంగాల్): లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ , బీజేపీ తనను ఇరవై నాలుగు గంటలూ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. తన గొంతు నొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తానూ ఎవరికీ భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. తనపై 36 కేసులు పెట్టారని, తన ప్రభుత్వ నివాసాన్ని లాగేసుకున్నారని, తన సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా 55 గంటల పాటు విచారించారని, అయినా తాను నరేంద్ర మోడీకి భయపడే ప్రసక్తే లేదని ఆయన గర్జించారు.



ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న సంబంధాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల్లో భారతదేశ వ్యవసాయరంగం, చిన్న తరహా పరిశ్రమలు, ఇంధన భద్రతను తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. దేశ ప్రజల వ్యక్తిగత డేటాను కూడా అమెరికాకు అప్పగించారని, ఒత్తిడి లేకుండా ఏ ప్రధాని కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ కేవలం కొందరు బిలియనీర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, దీనివల్ల దేశంలోని చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ (MSME)లు కుప్పకూలిపోయాయని ఆయన విమర్శించారు.


కేంద్రంతో పాటు బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై కూడా రాహుల్ తన విమర్శల పదును పెంచారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని పరిశ్రమలను నాశనం చేసిందని, ఇక్కడ కేవలం టీఎంసీ నాయకుల బంధువులకే ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఆయన మండిపడ్డారు. శారదా, రోజ్ వ్యాలీ వంటి చిట్ ఫండ్ కుంభకోణాలను ప్రస్తావిస్తూ.. టీఎంసీ అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రంలో గూండా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మమతా దీదీ, బెంగాల్ యువతను మోసం చేశారని, 84 లక్షల మంది యువత నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. తొలి దశలో భారీ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో, బెంగాల్ మార్పు కోరుకుంటోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured post

జామ్ నగర్ 'జామ్ సాహెబ్' అజయ్ జడేజా రాజభవనం

పురాతన కళాఖండాలు, పచ్చని ఉద్యానవనాలతో మెరిసిపోతున్న క్రికెట్ దిగ్గజం నివాసం జామ్ నగర్: భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తన అద్భుతమైన జీవనశైలిత...