- కుప్పకూలిన సైనిక మౌలిక సదుపాయాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇరాన్ ,లెబనాన్ లక్ష్యంగా భారీ వైమానిక దాడులను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌లోని 200కు పైగా వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను, లెబనాన్‌లోని 140కి పైగా హెజ్‌బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దీర్ఘశ్రేణి ప్రహార సామర్థ్యాలను, రక్షణవ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని ఆయుధ నిల్వ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ , అభివృద్ధి కేంద్రాలు, అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలపై ఐడీఎఫ్ విరుచుకుపడింది.
మరోవైపు లెబనాన్‌లో హెజ్‌బొల్లాకు చెందిన శిక్షణ కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులు, రాడ్వాన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ సంస్థ కమాండ్ స్ట్రక్చర్‌ను దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఈ దాడులపై స్పందిస్తూ.. ఇరాన్ పారిశ్రామికరంగానికి ఇది కోలుకోలేని దెబ్బ అని అభివర్ణించారు. ముఖ్యంగా ఇరాన్ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంలో 70 శాతం నాశనమైందని, దీనివల్ల ఐఆర్జీసీకి ఆయుధ తయారీకి అవసరమైన నిధులు, వనరులు అందకుండా పోతాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా సహకారంతో సాగుతున్న ఈ పోరాటంలో ఇరాన్ ఉగ్రవాద పాలనను అణచివేస్తామని, ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని నెతన్యాహు తెలిపారు. ఉత్తర ప్రాంత పౌరుల రక్షణ కోసం హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment