Saturday, 25 April 2026

సత్యజిత్ రే నడయాడిన నేలపై 'మహా' సంగ్రామం


  • భవానీపూర్ కోటలో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి
  •  బెంగాల్ అస్తిత్వానికి పరీక్షగా నిలిచిన ప్రతిష్టాత్మక పోరు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై అత్యంత ఉత్కంఠ రేపుతున్న 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్'కు భవానీపూర్ వేదిక కానుంది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో దశ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తన మాజీ శిష్యుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారితో ముఖాముఖి తలపడనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశబంధు చిత్తరంజన్ దాస్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల వారసత్వానికి, సత్యజిత్ రే, మృణాల్ సేన్ వంటి దిగ్గజాల కళా హృదయానికి నిలయమైన ఈ నియోజకవర్గం, ఇప్పుడు బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపులో ఉంది. 2011 నుంచి తన కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మమత 'స్థానిక' సెంటిమెంట్‌ను నమ్ముకోగా, ఆమెను ఓడించి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని సువేందు పట్టుదలతో ఉన్నారు.



భవానీపూర్ నియోజకవర్గం కేవలం ఒక రాజకీయ స్థానం మాత్రమే కాదు, అది బెంగాలీ సంస్కృతికి ఒక ప్రతిరూపం. కాళీఘాట్ ఆలయం, చారిత్రక గురుద్వారాలు, పురాతన చర్చిలు, మసీదులతో విభిన్న సంస్కృతుల కలయికగా ఉన్న ఈ ప్రాంతంలో.. మమతా బెనర్జీ ప్రతి గల్లీలో తిరుగుతూ తన పాత పరిచయాలను గుర్తు చేసుకుంటున్నారు. "ఆమె ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మాకు మాత్రం మా ఇంటి ఆడబిడ్డ" అని స్థానికులు చెబుతుండటం ఆమెకు సానుకూల అంశం. అయితే, నందిగ్రామ్ నుండి వచ్చిన సువేందు అధికారిపై 'బయటి వ్యక్తి' అనే ముద్ర ఉన్నప్పటికీ, ఆయన నిర్వహిస్తున్న భారీ ర్యాలీలు, కాషాయ జెండాల సందడి బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన అనుభవం సువేందుకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది.



ఈసారి భవానీపూర్‌లో వాతావరణం గతంలో కంటే భిన్నంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఏకపక్షంగా సాగిన ఇక్కడి తీర్పులో ఇప్పుడు స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. బెంగాలీ , బెంగాలీయేతర ఓటర్ల మధ్య అభిప్రాయభేదాలు చర్చనీయాంశంగా మారాయి. చొరబాటుదారులు, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన , రాష్ట్ర ఆర్థిక మందగమనం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కొందరు మార్పు కోరుకుంటుండగా.. మహిళల భద్రత , మైనారిటీల సంక్షేమం విషయంలో మమత వైపే మొగ్గు చూపుతున్న వారు కూడా ఉన్నారు. భవానీపూర్ ప్రజలకు ఇది కేవలం ఓటు మాత్రమే కాదు, ఒక ప్రతిష్టాత్మకమైన అంశం. మే 4న వెలువడే ఫలితాల్లో ఈ చారిత్రక నేల ఎవరికి పట్టం కడుతుందనేది ఇప్పుడు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.




No comments:

Post a Comment

Featured post

జామ్ నగర్ 'జామ్ సాహెబ్' అజయ్ జడేజా రాజభవనం

పురాతన కళాఖండాలు, పచ్చని ఉద్యానవనాలతో మెరిసిపోతున్న క్రికెట్ దిగ్గజం నివాసం జామ్ నగర్: భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తన అద్భుతమైన జీవనశైలిత...