Sunday, 12 April 2026

ఇస్లామాబాద్ చర్చలు విఫలం


  • అమెరికా షరతులకు ఇరాన్ నో
  • సందిగ్ధంలో పశ్చిమాసియా శాంతి

పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. శనివారం దాదాపు 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ప్రకటించారు. తాము అత్యుత్తమమైన , చివరి ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచామని, కానీ వారు దానికి అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. చర్చలు విఫలం కావడం ఇరాన్‌కు "చెడ్డ వార్త" అని వ్యాఖ్యానించిన వాన్స్, తమ బృందం ఇస్లామాబాద్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా అణు ఆయుధాల తయారీ అంశంపైనే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది.



ఈ చర్చల వైఫల్యానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమమేనని అమెరికా ఆరోపిస్తోంది. భవిష్యత్తులో ఎప్పుడూ అణు ఆయుధాలను తయారు చేయబోమని, అందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయబోమని ఇరాన్ నుంచి స్పష్టమైన హామీని తాము కోరామని వాన్స్ తెలిపారు. అయితే దీర్ఘకాలికంగా అణు ఆయుధాలను వదులుకోవాలనే సంకల్పం ఇరాన్ ప్రతినిధుల్లో కనిపించలేదని ఆయన విమర్శించారు. ఇరాన్‌కు చెందిన అనేక అణు కేంద్రాన్ని ఇప్పటికే ధ్వంసం చేశామని, అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వైఫల్యానికి అమెరికానే కారణమని ఆరోపించింది. అమెరికా ప్రతినిధులు గొంతెమ్మ కోర్కెలు, అహేతుకమైన డిమాండ్లు చేయడం వల్లే చర్చల్లో పురోగతి లేకుండా పోయిందని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.


ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చర్చలు విఫలమైతే మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బి) ఏమిటన్న ప్రశ్నకు, తమకు ఎటువంటి బ్యాకప్ ప్లాన్ అవసరం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ సైన్యం ఇప్పటికే ఓడిపోయిందని, వారి వద్ద క్షిపణులు, తయారీ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమ సైన్యం ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని, కాబట్టి చర్చలు కాకపోతే యుద్ధ క్షేత్రంలో తామే పైచేయి సాధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై చర్చలు జరిగినప్పటికీ, అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ లొంగకపోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి.

No comments:

Post a Comment

Featured post

అమెరికా గొంతెమ్మ కోర్కెల వల్లే చర్చలు విఫలం

ఇరాన్ ఘాటు విమర్శలు ఇరాన్ , అమెరికా మధ్య పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో పాకిస్తాన్‌లో జరిగిన చరిత్రాత్మక చర్చలు ఎటువంటి ముగింపు ...