- ‘పెద్ది’ సినిమా వివాదంపై జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలిచిన మేకప్ ఆర్టిస్ట్
- బాక్సాఫీస్ వసూళ్ల కోసమే దర్శకుడు అలా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, మరోవైపు ఈ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై, ముఖ్యంగా కొన్ని సీన్లలో ఆమెను అమితంగా శృంగారభరితంగా ప్రదర్శించారంటూ వస్తున్న విమర్శల నడుమ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర నెటిజన్ల ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వివాదంలో జాన్వీ కపూర్‌కు ఊరటనిస్తూ ఆమె వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మంచందా మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు నటిది కాదని, కేవలం థియేటర్లకు జనాన్ని రప్పించి బాక్సాఫీస్ వసూళ్లను పెంచుకోవడం కోసమే దర్శకుడు బుచ్చిబాబు సనా నటి విధించిన ప్రొఫెషనల్ హద్దులను దాటారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
సావ్లీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకుంటూ.. తెరపై నటి కనబడే విధానాన్ని బట్టి ఆమెను నిందించడం చాలా సులువని, కానీ అసలు నిజం వేరే ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో, పోస్ట్ ప్రొడక్షన్ (ఎడిటింగ్) దశలో కొన్ని నిర్దిష్టమైన కెమెరా యాంగిల్స్ , విజువల్స్ పట్ల జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. సినిమాల్లో మహిళలను కేవలం ఒక గ్లామర్ వస్తువులా చేసే పరిశ్రమ ధోరణికి వ్యతిరేకంగా జాన్వీ ఎల్లప్పుడూ బహిరంగంగా మాట్లాడుతుందని, అదే విధంగా ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకరమైన షాట్లను తొలగించాలని ఆమె ఎడిటింగ్ రూమ్‌లోనే గట్టిగా ప్రశ్నించిందని సావ్లీన్ స్పష్టం చేశారు.
నటిగా జాన్వీ కపూర్ తన ప్రొఫెషనల్ పరిమితులను స్పష్టంగా చెప్పినప్పటికీ, చివరి ఎడిటింగ్‌లో ఆ దృశ్యాలను అలాగే ఉంచారని ఆమె ఆరోపించారు. ఇది ఒక నటి తన గౌరవం కోసం నిలబడటంలో విఫలమైన సందర్భం కాదని, కేవలం సినిమా కలెక్షన్ల కోసమే ఒక మహిళ అనుమతి ,ఆమె పెట్టిన నిబంధనల కంటే బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం అని భావించిన దర్శకుడు ఆ హద్దులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని సావ్లీన్ ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సనా.. ప్రేక్షకుల విమర్శల మేరకు ఆయా సీన్లను సినిమాలో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో, జాన్వీ మేకప్ ఆర్టిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో మరింత చర్చకు దారితీశాయి.
No comments:
Post a Comment