- 68 ఏళ్ల తర్వాత కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి దాటిన మెగా టోర్నీ
- స్వీడన్ పై నెదర్లాండ్స్ సునామీ విజయంలో నమోదైన టోర్నమెంట్ 100వ గోల్
- ప్రపంచకప్ చరిత్రలో వందో గోల్ మార్కును అందుకున్న ఎనిమిదో దేశంగా డచ్ జట్టు
- జపాన్-ట్యునీషియా పోరుతో 1000వ మ్యాచ్ మైలురాయిని తాకిన ఫిఫా
ఉత్తర అమెరికా వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) అప్పుడే రికార్డుల వేటను ప్రారంభించి ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ మెగా టోర్నమెంట్ కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అత్యంత వేగంగా అధిగమించి, గత 68 ఏళ్లలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూన్ 12న జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై మెక్సికో ఆటగాడు జూలియన్ క్విన్యోన్స్ ఈ టోర్నీలోనే మొదటి గోల్ సాధించగా.. ఆదివారం (భారత కాలమానం ప్రకారం) స్వీడన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 5-1 తేడాతో ఘనవిజయం సాధించిన తరుణంలో ప్రస్తుత టోర్నమెంట్‌లో వందో గోల్ నమోదైంది. నెదర్లాండ్స్ ఆటగాడు కోడి గ్యాక్‌పో కొట్టిన డచ్ జట్టు మూడో గోల్.. ఈ మెగా టోర్నీకి 100వ గోల్‌గా నిలిచింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే వంద గోల్స్ నమోదు కావడం అనేది 1982, 2014 టోర్నీల (36 మ్యాచ్‌లు) రికార్డుతో పాటు 1978, 1994 ప్రపంచకప్‌ల (38 మ్యాచ్‌లు) రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, ఆల్‌టైమ్ రికార్డు మాత్రం స్విట్జర్లాండ్‌లో జరిగిన 1954 ప్రపంచకప్ పేరిట ఉంది. పశ్చిమ జర్మనీ విజేతగా నిలిచిన ఆ టోర్నీలో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే వంద గోల్స్ మార్కు దాటడం విశేషం.
ఈ రికార్డుతో పాటు నెదర్లాండ్స్ (డచ్) జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే మొత్తంగా 100 గోల్స్ సాధించిన కేవలం ఎనిమిదో దేశంగా నిలిచి ఎలైట్ క్లబ్‌లో చేరింది. స్వీడన్‌తో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే గ్యాక్‌పో ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను బ్రాబీ గోల్‌గా మలిచి జట్టుకు డ్రీమ్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత 17వ నిమిషంలో బ్రాబీ తన వ్యక్తిగత రెండో గోల్‌ను సాధించగా.. అది ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ దేశానికి లభించిన వందో గోల్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
మరోవైపు, మాంటెర్రే స్టేడియంలో జపాన్, ట్యునీషియా దేశాల మధ్య జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్.. ఫిఫా ప్రపంచకప్ సుదీర్ఘ చరిత్రలోనే మైలురాయి లాంటి 1000వ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ చరిత్రాత్మక సందర్భంపై ఫిఫా (FIFA) స్పందిస్తూ.. "1000వ మ్యాచ్ అనేది ఫుట్‌బాల్ క్రీడ పట్ల, ప్రపంచకప్ పట్ల మానవాళికి ఉన్న అంతులేని ప్రేమకు , ఈ క్రీడ , సుదీర్ఘ ప్రయాణానికి ప్రతీక. అన్ని అడ్డంకులను బద్దలు కొట్టి, భిన్న సంస్కృతులను, దేశాలను ఏకతాటిపైకి తీసుకురాగల ఫుట్‌బాల్ ,ప్రత్యేక శక్తికి ఇది నిదర్శనం" అని కొనియాడింది. ఈసారి ఉత్తర అమెరికాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 48 దేశాలు పాల్గొంటుండగా, వాటిని 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మూడో స్థానాల జట్లు తదుపరి నాకౌట్ (రౌండ్ ఆఫ్ 32) దశకు అర్హత సాధించనున్నాయి.
No comments:
Post a Comment