- తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లతో రామ్ చరణ్ రికార్డుల వేట
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ శాక్‌నిల్క్ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ చిత్రం భారతదేశ వ్యాప్తంగా మొదటి రోజే 16.25 కోట్ల రూపాయల నికర (నెట్) వసూళ్లను సాధించగా, గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఏకంగా 19.18 కోట్ల రూపాయలను రాబట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 5,695 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం తొలిరోజు 41.4 శాతం సగటు ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. ఈ వసూళ్లలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం. మొత్తం వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచే 15.43 కోట్ల రూపాయలు రాగా, 3,463 షోలలో రికార్డుస్థాయిలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీ వెర్షన్ 1,705 షోల ద్వారా 64 లక్షల రూపాయలు వసూలు చేయగా, తమిళం 9 లక్షలు, కన్నడ 6 లక్షలు, మలయాళం 3 లక్షల రూపాయల చొప్పున వసూళ్లను సాధించాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా వైజాగ్ అత్యధికంగా 91 శాతం ఆక్యుపెన్సీతో అగ్రస్థానంలో నిలవగా, కాకినాడ 88 శాతం, విజయవాడ 80 శాతం ఆక్యుపెన్సాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు గుంటూరులో 77 శాతం, వరంగల్‌లో 76 శాతం, మహబూబ్‌నగర్‌లో 75 శాతం మేర థియేటర్లు నిండాయి. అత్యధికంగా 1,128 షోలతో నడుస్తున్న హైదరాబాద్‌లో 67 శాతం సాలిడ్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే చెన్నైలో 39 శాతం, బెంగళూరులో 31 శాతం, ముంబైలో తెలుగు వెర్షన్‌కు 27 శాతం ఆక్యుపెన్సీ లభించింది. అయితే ఉత్తరాది మార్కెట్లయిన సూరత్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో మాత్రం హిందీ వెర్షన్‌కు కేవలం 4 నుండి 5 శాతం ఆక్యుపెన్సీతో కాస్త మందకొడి స్పందన వచ్చింది. కాగా, హైదరాబాద్‌లోని తెలుగు హెచ్‌డిఆర్ (HDR) షోలు 100 శాతం, ఎపిక్ (EPIQ) స్క్రీన్స్ 99 శాతం ఆక్యుపెన్సీతో సరికొత్త రికార్డు సృష్టించాయి.
విడుదలకు ముందే జూన్ 4 నాటికి 'పెద్ది' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం భారతదేశంలోనే 3.85 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా, బ్లాక్ బుకింగ్స్‌తో కలిపి అడ్వాన్స్ సేల్స్ ద్వారానే 15.4 కోట్ల గ్రాస్ వసూలైంది. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, ఒక శక్తివంతమైన ప్రత్యర్థి నుండి తమ ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి క్రీడల ద్వారా గ్రామస్థులను ఒక తాటిపైకి తెచ్చే యువకుడిగా రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు , శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. తొలిరోజు వచ్చిన అద్భుతమైన స్పందన, భారీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ వీకెండ్‌లో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment