Thursday, 23 July 2026

గ్లోబరీనా వివాదంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు


  • 48 గంటల్లో బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్


గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, దానిని తన బెనామీ కంపెనీగా చిత్రించి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన, హానికరమైన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ పరిణామాలతో పాటు నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థలో తనకు ఎలాంటి భాగస్వామ్యం గానీ, ఆర్థిక ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసిన కేటీఆర్, తనపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు ఆధారాలు చూపించాలని సీఎంకు సవాలు విసిరారు. ఒకవేళ అది తన బెనామీ కంపెనీయే అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంస్థతో ఒప్పందాలు ఎందుకు చేసుకుందో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలని నిలదీశారు.



కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నీట్ పరీక్షల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఇటువంటి రాజకీయ నాటకాలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పడానికి కూడా సీఎం భయపడుతున్నారని విమర్శించారు. పగలు కాంగ్రెస్‌లో, రాత్రి బీజేపీలో ఉంటూ పాత కేసులకు భయపడి రేవంత్ రెడ్డి కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గ్లోబరీనా వ్యవహారంపై సీబీఐ, సీఐడీ, సిట్ వంటి ఏ విచారణ సంస్థల చేతనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన కేటీఆర్.. ప్రజల సమక్షంలో లై డిటెక్టర్ (Lie Detector) పరీక్షకు సిద్ధమా అని సవాలు విసిరారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Featured post

విద్యార్థుల ఆందోళనకు మురళీ మనోహర్ జోషి మద్దతు

  పోలీసుల బలప్రయోగంపై బీజేపీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన బాట పట్ట...