- పలు రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్
- ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
దేశవ్యాప్తంగా రుతుపవనాలు మళ్లీ ఉద్ధృతంగా మారుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు రాష్ట్రాలకు కీలక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. సోమవారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 14 గంటలు అత్యంత కీలకమని, వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని హెచ్చరించింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, ఈ వారం మొత్తం హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే సోమవారం నుంచి పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
భారీ వర్షాలతో పాటు రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు అధిక వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై, సాధారణం కంటే 1.3 డిగ్రీలు ఎక్కువగా ఉందని ఐఎండీ వెల్లడించింది. పలామ్ కేంద్రంలో 26.8 డిగ్రీలు, లోధీ రోడ్‌లో 27.8 డిగ్రీలు, రిడ్జ్‌లో 24.8 డిగ్రీలు, అయానగర్‌లో 27.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో సఫ్దర్‌జంగ్, పలామ్, అయానగర్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని, లోధీ రోడ్, రిడ్జ్ ప్రాంతాల్లో మాత్రం స్వల్ప జల్లులు మాత్రమే కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) వరుసగా రెండో రోజు 101గా నమోదై ‘మోస్తరు’ విభాగంలో కొనసాగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
No comments:
Post a Comment