ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం యునెస్కో, బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతానికి చెందిన రెండు చారిత్రక థియేటర్లను తమ ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. 'అమెజోనియా థియేటర్లు'గా పిలిచే వీటిలో బెలెమ్ నగరంలోని 'దియాట్రో డా పాజ్' , మనౌస్ నగరంలోని 'టియాట్రో అమెజోనాస్' ఉన్నాయి. 19వ శతాబ్దం చివర్లో రబ్బరు వ్యాపారం ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో నిర్మించిన ఈ రెండు రంగుల కళాక్షేత్రాలు యురోపియన్ నిర్మాణ శైలికి , స్థానిక అమెజాన్ సంస్కృతికి అద్దం పడతాయి. రాజకీయ, పట్టణ రంగాలు సాధించిన అభివృద్ధికి ప్రతీకలుగా వీటిని యునెస్కో అభివర్ణించింది. 1878లో ప్రారంభమైన దియాట్రో డా పాజ్ బెలెమ్ ఓడరేవు ప్రాధాన్యతను చాటిచెప్పగా, 1896లో రూపుదిద్దుకున్న టియాట్రో అమెజోనాస్ మనౌస్ నగర వేగవంతమైన ప్రగతికి నిదర్శనంగా నిలిచింది.
ఈ రెండు నిర్మాణాలను ఒకే చారిత్రక కాలానికి చెందినవిగా, అమెజాన్ ప్రాంతాన్ని ప్రపంచ వాణిజ్య , సాంస్కృతిక రంగానికి అనుసంధానించే దిశగా సాగిన ఆధునిక ప్రయాణానికి చిహ్నాలుగా బ్రెజిల్ ప్రభుత్వం సంయుక్తంగా నామినేట్ చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పదార్థాలు, శైలులతో పాటు స్థానిక అడవుల కలప మరియు అమెజాన్ సంప్రదాయ డిజైన్లతో అద్భుతంగా రూపొందించిన ఈ కళాఖండాలు అటు అంతర్జాతీయతను, ఇటు అమెజాన్ ప్రాచీనతను ఏకకాలంలో ఆవిష్కరిస్తాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించడం వల్ల ఈ ప్రాంతాలకు అంతర్జాతీయ రక్షణతో పాటు పర్యాటక రంగం గణనీయంగా పుంజుకుంటుంది.
ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరుగుతున్న యునెస్కో కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త చేరికతో బ్రెజిల్‌లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 26కు చేరింది. వీటితో పాటు బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ పరివాహక సంరక్షణ ప్రాంతం కూడా ఇప్పటికే యునెస్కో జీవవైవిధ్య వారసత్వ జాబితాలో కొనసాగుతోంది.
No comments:
Post a Comment