Sunday, 12 July 2026

రక్తం పారించైనా సరే రైతాంగానికి నీళ్లివ్వండి




  • కాంగ్రెస్ రాక్షస పాలనపై రక్తం చిందించేందుకైనా సిద్ధం
  • సీఎం  రేవంత్ రెడ్డి ‘బెల్ట్ ట్రీట్‌మెంట్’ వ్యాఖ్యలపై కేటీఆర్ పైర్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ పతాకస్థాయికి  కాంగ్రెస్-బీఆర్‌ఎస్ రాజకీయ యుద్ధం


హైదరాబాద్‌: తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చుట్టూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్ నేతల రక్తం చల్లితే పొలాలు పండుతాయని, వారికి ‘బెల్ట్ ట్రీట్‌మెంట్’ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం చేసిన సంచలన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం అత్యంత ఘాటుగా స్పందించారు. రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన ‘రక్తపాతం’, అహంకారపూరిత వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు సాగునీరు అడుగుతుంటే రక్తం పారిస్తామని మాట్లాడటం రేవంత్ రెడ్డి రక్తపిపాసి వైఖరికి నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. గత 60 ఏళ్లుగా తెలంగాణను తొక్కేసి, ఇక్కడి ప్రజల రక్తాన్ని తాగిన కాంగ్రెస్ పార్టీకి ఇంకా దాహం తీరలేదా అని ప్రశ్నించారు. 1952 నాటి ముల్కీ ఉద్యమంలో ఏడుగురు యువకులను కాల్చి చంపిన చరిత్ర, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమాయక బిడ్డల రక్తం చిందించిన పాపం, మలిదశ ఉద్యమంలో వెయ్యి మంది బలిదానాలకు కారణమైన రక్తపు మరకలు కాంగ్రెస్ రాక్షస హస్తాలకు శాశ్వతంగా అంటుకునే ఉంటాయని కేటీఆర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్తూ.. ఒకవేళ ఈ క్రూర కాంగ్రెస్ ప్రభుత్వం రక్తం ఇస్తేనే నీళ్లు ఇస్తామంటే, తమ రక్తాన్ని ఎంతైనా ధారబోయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ రక్తంతోనైనా ముఖ్యమంత్రి కడుపు నింపుకుని ఎండిపోతున్న రైతుల పొలాలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వివాదం అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా వేదికగా కేటీఆర్, టి. హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని చేసిన కఠిన వ్యాఖ్యల వల్ల ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ అగ్రనేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఒంటికి రాయి కట్టుకుని నీటిలో దూకి చావాలని, అప్పుడే తెలంగాణను పట్టిన ‘శని’ వదిలిపోతుందని ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేసిన పాపాలు చాలక కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో దాక్కుంటే, ఈ ఇద్దరు నేతలు సిగ్గులేకుండా తిరుగుతూ ప్రజలకు అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకొని రిటైర్డ్‌ ఇంజినీర్లు కాళేశ్వరం నీళ్లు ఇవ్వుమంటున్నారు. నేను జైలుకు పంపుతలేనని.. నాకే సలహాలు ఇస్తున్నరా? వాళ్లకేకాదు, కరువు వస్తదని అన్న ఆఫీసర్లకూ బెల్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఇయ్యాలని వ్యాఖ్యానించారు.  పంటలకు నీళ్లెందుకు..? పరోక్షంగా కేసీఆర్‌, కేటీఆర్‌,హరీశ్‌ను ఉద్దేశించి కోసి రక్తం చల్లితే పంటలవే పండుతయ్‌. వీళ్ల బలుపు, కొవ్వు పంటలకు సరిపోతదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు వైఫల్యాలపై ఎవరైనా నిపుణులను పంపి నిజాలు తెలుసుకోవచ్చని, దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్తూ.. వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నందు వల్లే తాను ఈ పచ్చి నిజాలు మాట్లాడాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం గోదావరి నదిపై నిర్మితమైన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో తలెత్తిన ఈ సాంకేతిక, రాజకీయ వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.


No comments:

Post a Comment

Featured post

రాముడి విరాళాల చోరీ.. సూత్రధారులకు సేఫ్ ఎగ్జిట్ ఇచ్చిన మోడీ

అయోధ్య చందా కుంభకోణంపై సిట్‌ దర్యాప్తును తప్పుబడుతూ జైరాం రమేష్  ఆరోపణలు నేడు సుప్రీంకోర్టులో విచారణ వేళ దేశవ్యాప్తంగా పతాక స్థాయికి చేరిన ర...