- ఒప్పందాలతో సంబంధం లేకుండా అణుబాంబును అడ్డుకుంటాం
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటు హెచ్చరిక!
టెహ్రాన్ / టెల్ అవీవ్: పశ్చిమాసియాలో తాత్కాలిక ‘కాల్పుల విరమణ’ ఒప్పందం పూర్తిగా కుప్పకూలడంతో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య భీకర క్షిపణి, డ్రోన్ యుద్ధం మొదలైంది. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు , రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో యుద్ధం ఇంకా ముగియలేదని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఎలాంటి దౌత్యపరమైన ఒప్పందాలు కుదిరినా, కుదరకపోయినా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను (Nuclear Weapons) సాధించకుండా ఇజ్రాయెల్ అడ్డుకుని తీరుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సైనిక చర్యలు ఇప్పటికే ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాయని, తమ సైన్యం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే లెబనాన్‌లోనూ తమ బలగాలు ఎంతకాలమైనా కొనసాగుతాయన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దళం యెమెన్ నుంచి ఇరాన్ వరకు ఎక్కడికైనా చొచ్చుకెళ్లగలదని నిరూపించామని, అవసరమైతే మూడోసారి కూడా అంతకంటే ఎక్కువ బలంతో ఇరాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు.
ఈ భీకర యుద్ధ వాతావరణం, ట్రంప్ వ్యతిరేక నినాదాల మధ్యే ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు పవిత్ర మషద్ నగరంలో ముగిశాయి. అయితే, కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ బహిరంగ అంత్యక్రియలకు హాజరుకాలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరు దేశాల దాడులతో ప్రపంచ ఇంధన సరఫరా కారిడార్‌గా ఉన్న పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
No comments:
Post a Comment