- కఠిన వైఖరితో ఉక్కుపాదం మోపుతాం
- సరిహద్దు జిల్లాల ఎస్పీల సమీక్షలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భారతదేశ సరిహద్దు భద్రతను శత్రు దుర్భేద్యంగా మార్చడంతో పాటు, అక్రమ చొరబాట్ల కారణంగా సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్న అసహజ జనాభా మార్పులను (డెమోగ్రాఫిక్ చేంజెస్) ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం (జూలై 9, 2026) అత్యంత స్పష్టంగా ప్రకటించారు. ఢిల్లీ వేదికగా దేశంలోని 119 సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు (ఎస్పీలు) హాజరైన ‘మొదటి ల్యాండ్ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఎస్పీల కాన్ఫరెన్స్-2026’ లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు నిత్యానంద్ రాయ్, బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ మహేష్ దీక్షిత్‌లతో పాటు పలువురు సీనియర్ అధికారులు హాజరైన ఈ సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల కాలంలో సరిహద్దు సమస్యలు శాశ్వతంగా ఉంటూ, పరిష్కారాలు తాత్కాలికంగా ఉండేవని.. కానీ మోడీ ప్రభుత్వం సమస్యల మూలాలపై దెబ్బకొడుతూ శాశ్వత పరిష్కారాలను అన్వేషిస్తోందని చెప్పారు. సరిహద్దుల్లో అసహజ జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ‘డెమోగ్రాఫిక్ మిషన్’ను ప్రారంభించారని, సరిహద్దు భద్రతలో భారతదేశ వ్యూహాన్ని కేవలం స్పందించే స్థాయి (రియాక్టివ్) నుంచే ముందే అప్రమత్తమయ్యేలా (ప్రోయాక్టివ్) మార్చామని స్పష్టం చేశారు.
దేశాన్ని పూర్తిస్థాయిలో చొరబాట్ల రహితంగా మార్చేందుకు సరిహద్దు రక్షక దళాలు, రాష్ట్ర , జిల్లా యంత్రాంగాలు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలు , స్థానిక ప్రజలను అనుసంధానిస్తూ ఒక శక్తివంతమైన ‘క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్’ (చతుర్భుజ భద్రతా వలయం) ను నిర్మించినట్లు హోంమంత్రి వెల్లడించారు. మోడీ ప్రభుత్వం గతంలో కంటే సరిహద్దు మౌలిక సదుపాయాలను ఏకంగా 400 శాతం బలోపేతం చేసిందని, ప్రస్తుతం దీనిని మరింత శాస్త్రీయ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కేవలం వివిక్త సరిహద్దు అవుట్‌పోస్ట్‌ల వ్యవస్థ నుంచి సమగ్ర సెక్యూరిటీ గ్రిడ్ వైపు అడుగులు వేస్తున్నామని.. ప్రాక్సీ వార్స్ (పరోక్ష యుద్ధాలు), తీవ్రవాదం, మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) అక్రమ రవాణా, స్మగ్లింగ్, డ్రోన్ల ద్వారా వచ్చే ముప్పులు, సైబర్ నేరాలు , వ్యవస్థీకృత నేరాలను నిర్మూలించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. రాబోయే మూడు సంవత్సరాలలో దేశాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అంతమొందించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ రక్షణలో కోస్తా తీర ప్రాంతాల భద్రతను, భూ సరిహద్దుల భద్రతను సమగ్రంగా అనుసంధానిస్తూ ముందుకు సాగుతామన్నారు.
సరిహద్దుల్లో చొరబాట్ల సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి అత్యున్నతస్థాయికి వీలైనంత వేగంగా చేరవేయడం అత్యంత కీలకమని, ఈ దిశగా రూ.31,000 కోట్ల భారీ వ్యయంతో 1,610 కిలోమీటర్ల పొడవైన భారత్-మయన్మార్ సరిహద్దుకు పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ (కంచె) వేసే పనులు వేగంగా సాగుతున్నాయని అమిత్ షా వెల్లడించారు. ‘స్మార్ట్ బోర్డర్’ విజన్ ఆధారంగా నిర్మిస్తున్న భారతదేశ సరిహద్దు భద్రతా వ్యవస్థ.. రాబోయే కొద్ది సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని సగర్వంగా ప్రకటించారు. మోడీ నాయకత్వంలో దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందిందని, జమ్మూకశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదానికి చరమగీతం పాడామని, ఇది దేశ ఉమ్మడి విజయానికి నిదర్శనమని కొనియాడారు. 'వైబ్రెంట్ విలేజెస్' కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ దేశపు చివరి గ్రామాన్ని మొదటి గ్రామంగా అభివర్ణించారని.. ఆయా సరిహద్దు గ్రామాల నుంచి ప్రజల వలసలను నిరోధించి, ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100 శాతం అమలు చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

No comments:
Post a Comment