Showing posts with label # World Press Freedom Day. Show all posts
Showing posts with label # World Press Freedom Day. Show all posts

Saturday, 2 May 2026

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం - సవాళ్లు


  • ప్రజాస్వామ్య గొంతుకకు రక్షణ
  • సంకెళ్లలో స్వేచ్ఛా పత్రికా రంగం
  • జర్నలిస్టుల దయనీయ స్థితిపై ఆందోళన



 సమాజంలో స్వతంత్ర పత్రికా రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పడానికి ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం (World Press Freedom Day) నిర్వహిస్తారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా ఒక వారధిలా పనిచేస్తుంది. కచ్చితమైన సమాచారాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడమే దీని ప్రధాన విధి.వార్తలను ప్రచురించడానికి, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి బాహ్య వ్యక్తుల నుంచి అనవసరమైన జోక్యం లేదా సెన్సార్‌షిప్ లేకపోవడమే నిజమైన పత్రికా స్వేచ్ఛ.  ప్రాథమిక హక్కులలో ఒకటైన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం మే 3  ముఖ్య ఉద్దేశం. నిష్పక్షపాతంగా వార్తలు అందించే జర్నలిస్టులను గౌరవించడంతో పాటు, పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 



ఈ తరుణంలో, ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు ,పెరుగుతున్న ఆంక్షలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా రంగం నేడు అనేక దేశాల్లో సంకెళ్లలో బందీ అయిందని, నిజాలను నిర్భయంగా వెల్లడించే విలేకరులపై దాడులు, వేధింపులు , జైలు శిక్షలు నిత్యకృత్యంగా మారాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సమాజంలోని అన్యాయాలను ఎత్తిచూపే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలు పెరగడం వల్ల సమాచార స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని పౌర సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేవలం వార్తలు సేకరించినందుకే వందలాది మంది జర్నలిస్టులు కటకటాల వెనుక మగ్గుతుండటం పత్రికా స్వేచ్ఛా సూచీలో వివిధ దేశాల వెనుకబాటుకు నిదర్శనంగా మారుతోంది.



 ప్రభుత్వాల జోక్యం లేని స్వయంప్రతిపత్తి

ప్రస్తుత డిజిటల్ యుగంలో నిఘా పెరగడం,తప్పుడు ప్రచారాలు (Misinformation) పత్రికా రంగానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. నిజమైన జర్నలిజం మనుగడ సాగించాలంటే ప్రభుత్వాల జోక్యం లేని స్వయంప్రతిపత్తి ,జర్నలిస్టుల భద్రతకు భరోసా కల్పించడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పత్రికా స్వేచ్ఛ కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదని, అది పౌరులందరికీ నిజాన్ని తెలుసుకునే ప్రాథమిక హక్కు అని ఈ దినోత్సవం గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం స్పందించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన , జైలు పాలైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని, పత్రికా రంగానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం ద్వారానే బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించగలమని ఈ సందర్భంగా పలువురు మేధావులు పిలుపునిచ్చారు.

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 157 స్థానంలో భారత్

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం ఈ సూచీలో భారత్ 157వ స్థానానికి పడిపోయింది (గత ఏడాది 151వ స్థానంలో ఉంది). వరుసగా 10వ ఏడాది కూడా నార్వే మొదటి స్థానంలో నిలిచింది.  నెదర్లాండ్స్, ఎస్టోనియా, డెన్మార్క్ , స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  ఎరిత్రియా (180వ స్థానం) చివరిలో ఉండగా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్, సౌదీ అరేబియా కూడా అట్టడుగున ఉన్నాయి.

Featured post

దేశమంతటా వానల విలయతాండవం

అస్సాంలో 82కి చేరిన మృతులు కేరళలో ఎనిమిది మంది బలి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చడంతో పలు ...