- అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత రక్షణ బలోపేతానికి భారీ ఒప్పందం
అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరిగిన యుద్ధం తర్వాత తన వైమానిక రక్షణ వ్యవస్థలో బయటపడిన లోపాలను సరిదిద్దుకునేందుకు ఇరాన్ భారీ స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో చైనా తయారు చేసిన భుజంపై మోసుకెళ్లే గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలు (MANPADS) కొనుగోలు చేసేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే కొన్ని వారాల్లో తొలి విడతలో చైనా నుంచి క్షిపణి లాంచర్లు ఇరాన్‌కు చేరనున్నాయని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ముగ్గురు వర్గాలు తెలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం ప్రారంభమైన తర్వాత స్వల్ప శ్రేణి వైమానిక రక్షణను బలోపేతం చేసేందుకు ఇరాన్ చేపట్టిన అతిపెద్ద ప్రయత్నాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు 60 నుంచి 70 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.520-610 కోట్ల మధ్య)గా అంచనా వేస్తున్నారు. ఒప్పందం కింద 300 నుంచి 400 వరకు చైనా తయారు చేసిన QW-12, FN-16 రకం మాన్‌పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు (MANPADS) కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. హాంకాంగ్‌కు చెందిన జోంగ్‌కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అనే సంస్థ ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిందని వర్గాలు వెల్లడించాయి.
కొన్ని నెలలుగా సాగిన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్, వైమానిక రక్షణ కేంద్రాలపై దాడులు చేయగా, ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. ఈ యుద్ధం వల్ల స్థిరమైన సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలను అత్యాధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాల నుంచి రక్షించడం ఎంత కష్టమో ఇరాన్‌కు స్పష్టమైంది. దీంతో తక్షణమే తరలించగలిగే, చిన్న బృందాలు సులభంగా నిర్వహించగలిగే పోర్టబుల్ వైమానిక రక్షణ వ్యవస్థలను పెంచాలని ఇరాన్ నిర్ణయించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒప్పందం కుదిరిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ మాత్రం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, చైనా ఎల్లప్పుడూ శాంతి నెలకొల్పేందుకు, ఘర్షణలు ముగిసేందుకు మాత్రమే కృషి చేస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో ఒప్పందంలో మధ్యవర్తిగా పేర్కొన్న సంస్థ కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు పాకిస్థాన్ ద్వారా ఈ ఆయుధాలు ఇరాన్‌కు తరలించనున్నట్లు వచ్చిన కథనాలను కూడా పాకిస్థాన్ సైన్యం పూర్తిగా ఖండించింది.
వివిధవర్గాల సమాచారం ప్రకారం తొలి విడత సరఫరా పశ్చిమ చైనాలోని ఉరుమ్కీ నుంచి ప్రారంభమై పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చేరేలా ప్రణాళిక రూపొందించారు. అయితే రవాణా పూర్తిగా విమానాల ద్వారానా లేదా భూమార్గంలోనా అన్న విషయాన్ని వెల్లడించలేదు. ఇదే సమయంలో పాశ్చాత్య నిఘా వర్గాల సమాచారం ప్రకారం QW-12తో పాటు QW-18, QW-19 వంటి మరింత ఆధునిక క్షిపణి వ్యవస్థల కొనుగోలుపైనా ఇరాన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. QW-12, FN-16 క్షిపణులు భుజంపై మోసుకెళ్లే ఇన్‌ఫ్రారెడ్ గైడెడ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ వ్యవస్థలు. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేయగలవు. అవసరమైన చోటుకు వెంటనే తరలించి సైనిక స్థావరాలు, ఇంధన నిల్వలు, వ్యూహాత్మక ప్రాంతాల రక్షణకు వినియోగించవచ్చు. QW-18, QW-19 వంటి తాజా మోడళ్లతో పోలిస్తే QW-12 సామర్థ్యం తక్కువే అయినప్పటికీ, డ్రోన్లు మరియు తక్కువ ఎత్తులో వచ్చే లక్ష్యాలపై సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుందని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పాశ్చాత్య నిఘా వర్గాలు, ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం చైనా నుంచి సైనిక సామగ్రి, ద్వంద్వ వినియోగ పరికరాలను మరింత గోప్యంగా తరలించేందుకు భూమార్గాల వినియోగంపైనా ఇరాన్ పరిశీలిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ స్వదేశీ ఆయుధ తయారీతో పాటు విదేశీ సరఫరాదారులపై కూడా ఇరాన్ ఇప్పటికీ ఆధారపడుతోందని ఈ ఒప్పందం మరోసారి స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో చైనా నుంచి యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుపైనా ఇరాన్ మరో ప్రత్యేక ఒప్పందానికి చేరువలో ఉన్నట్లు గతంలో రాయిటర్స్ వెల్లడించినప్పటికీ, ఆ ఒప్పందం అమలులోకి వచ్చిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.