- 16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష
- ఆందోళనకరంగా క్షీణించిన ఆరోగ్యం!
న్యూఢిల్లీ: దేశంలో పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలో ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా జూన్ 28 నుండి ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ దీక్ష కారణంగా ఆయన శరీర బరువు ఏకంగా 8.2 కిలోలు తగ్గగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకరంగా 67 mg/dL కు పడిపోయాయని, బీపీ 107/70 mm Hg గా నమోదైందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పరీక్షల అక్రమాల వల్ల దేశంలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష 24 రోజులుగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో జులై 20న పార్లమెంట్ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ మార్చ్‌కు ముందే లేదా ఆ తర్వాత ప్రభుత్వం తమపై ఎన్‌ఎస్‌ఏ (NSA) లేదా ఉపా (UAPA) వంటి కఠిన చట్టాల కింద కేసులు బనాయించి, దేశద్రోహులుగా చిత్రీకరించి జైలుకు పంపే అవకాశం ఉందని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా ఆరోపించారు. దేశ భవిష్యత్తు కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని, అయితే ప్రభుత్వం ఇంకా ఎంతకాలం మొండిగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలను విస్మరిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత అతీషి నేతృత్వంలోని ప్రతినిధి బృందం, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రా రామ్, అలాగే శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే వంటి అగ్రనేతలు సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు సంఘీభావం ప్రకటించి మద్దతుగా నిలిచారు. ఇదే వేదికపై ఐసా (AISA) విద్యార్థి సంఘం నేతలు కూడా ప్రత్యేకంగా దీక్ష కొనసాగిస్తుండగా, ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా తీసుకోకుండా తక్షణమే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment