- ఆలయంలోకి ప్రవేశించిన స్వామివార్లు
పూరీ జగన్నాథ క్షేత్రంలో 12 రోజుల పాటు ఎంతో వైభవంగా సాగిన వార్షిక రథయాత్ర సోమవారం నాటి "నీలాద్రి విజే" పర్వదినంతో ముగిసింది. 12 వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం వెలుపల శ్రీ గుండిచా మందిరంలో గడిపిన అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తిరిగి మాతృ ఆలయంలోకి ప్రవేశించారు. జులై 16న రథారూఢులై 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గుండిచా మందిరానికి బయలుదేరడంతో ఈ రథయాత్ర ప్రారంభమైంది. జులై 24న జరిగిన బహుడా యాత్ర (తిరుగు ప్రయాణం) నుండి తమ రథాలపైనే ఆసీనులై ఉన్న మూలవిరాట్లను ప్రత్యేక శోభాయాత్ర ద్వారా గర్భగుడిలోకి తీసుకెళ్లి పవిత్ర రత్నసింహాసనంపై ప్రతిష్టించారు.
ముందుగా జగన్నాథుని దివ్యాయుధమైన శ్రీ సుదర్శన చక్రాన్ని, ఆ తర్వాత బలభద్రుడిని, సుభద్రాదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆపై భక్తుల 'హరిబోల్', 'జై జగన్నాథ్' నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య జగన్నాథస్వామిని గర్భగుడిలోకి వేంచేపు చేశారు. అయితే, మిగతా దేవుళ్ల ‘పహండి’ ఊరేగింపు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగినప్పటికీ, ప్రధాన ఆలయంలోకి జగన్నాథుడి ప్రవేశాన్ని మహాలక్ష్మి అమ్మవారు అడ్డుకున్నారు. పురాణాల ప్రకారం, తనను రథయాత్రకు తీసుకెళ్లనందుకు కోపగించిన మహాలక్ష్మి అమ్మవారికి జగన్నాథుడు తీపి తినుబండారమైన 'రసగుల్లా'ను, ఖరీదైన పట్టువస్త్రాన్ని సమర్పించి ప్రసన్నం చేసుకున్నారు. సేవకుల ద్వారా జరిగే ఈ సంవాదం పూర్తయి, మహాలక్ష్మి అనుమతి లభించిన తర్వాతే నీలాద్రి విజే ఘట్టం పూర్తయింది. ఈ ఆసక్తికరమైన సన్నివేశాన్ని తిలకించేందుకు సింహద్వారం వద్ద రెండు లక్షలకు పైగా భక్తులు వేచి చూశారు.
ఈసారి 10 రోజుల వ్యవధిలో దేశవిదేశాల నుంచి 50 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు పూరీ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అయితే, ఉక్కపోత, విపరీతమైన వేడి కారణంగా ఊపిరాడక ముగ్గురు భక్తులు మృతి చెందారు. రథయాత్ర రోజున ఇద్దరు, సుభద్రాదేవి రథాన్ని లాగుతూ మరొకరు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. భద్రత , రద్దీ నివారణ కోసం ఒడిశా పోలీసులు 13,000 మంది సిబ్బందిని, 400కి పైగా ఏఐ సీసీటీవీ కెమెరాలను రంగంలోకి దించారు. మహాప్రభువు కృపతో, ప్రతి ఒక్కరి సహకారంతో భక్తులందరికీ శాంతియుతంగా, సురక్షితంగా స్వామివారి దివ్యదర్శనం లభించిందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

No comments:
Post a Comment