Friday, 4 September 2026

టీచర్స్‌ డే.. మా శంకర్‌ సార్‌




సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మా రాసకట్ట శంకర్‌ సార్‌ గుర్తుకు వస్తారు. ఆసరి రాజు లాంటి వందలాది మందికి అక్షర జ్ఞానం నేర్పించిన గురువు.  గోదావరిఖని రాంనగర్‌ భగత్‌ సింగ్‌ స్కూల్‌లో చదివిన చాలామంది చదువుల్లోనే కాదు కల్చరల్‌ యాక్టివిటీలలో ప్రతిభను చాటడంలో ఆయన కృషి ఉన్నది. మా స్కూల్‌ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పత్రికా పఠనాన్ని అలవాటు చేసింది ఆయనే. రాసేటప్పుడు అక్షరాలు అందంగా ఉండాలని పిల్లలను మోటివేటి చేశారు. అట్లా మా పోలు సంపత్‌ లాంటి వాళ్లు రాస్తుంటే ప్రింటింగ్‌ ప్రెస్‌ అక్షరాల్లా కనిపిస్తుంటాయంటే దానికి కారణం ఆయనే. 


టీచర్స్‌ డే రోజున మమ్మల్ని టీచర్స్‌ చేసి వాళ్లు స్టూడెంట్స్‌ గా మారిపోయారు. అదో అందమైన జ్ఞాపకం. అప్పుడు మమ్మల్ని అందరినీ ఫొటో తీయించారు. అది చూసినప్పుడల్లా నా జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఎందుకంటే శంకర్‌ సార్‌ మాత్రమే కాదు మా కనకరాజు సార్‌, మా రాజేశ్‌ సార్‌, మా పద్మావతి మేడం  వీళ్లంతా పిల్లలను హ్యాండిల్ చేసిన విధానం  బాగుండేది. సాయంత్రం కాగానే కంజర, డమ్స్‌తో  కలిపి పాటల కచేరీ ఉండేది. సామాజిక స్పృహ కలిగించే పాటలను మాతో  పాడించేవారు. నాడు సారు వేసిన ఆ బీజం ఫలితంగా వాణినికేతన్‌ స్కూల్‌లో చదువుతున్నప్పుడు మండలస్థాయిలో పాటల పోటీలో ఫస్ట్‌ ప్రైజ్‌ రావడానికి కారణమైంది. ప్రజానాట్యమండలి కళాకారుడు అనుకుంటా మల్లిక్‌ రాసి, ట్యూన్‌ 'రాయలేలిన నాటి రతనాల సీమ' పాట ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్ర లాతూర్‌లో భూకంపం సృష్టించిన విలయంపై ఆయనే రాసిన ' ఆదమరిచి జనులు నిదురించువేళలో' అనే పాటకు మా సార్‌ ఆ బాణిని ఉపయోగించి నేర్పించారు. ఆ పాట పాడిందుకు మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్‌ రావడమే కాదు వందలాది మంది ఉండే మా వాణినికేతన్‌ స్కూల్‌లో నా కంటూ గుర్తింపు వచ్చింది. 



చిన్నతనంలో నేర్చుకునే విషయాలే తర్వాత కాలంలో ప్రతి విద్యార్థి ఉన్నత విద్యలో రాణించడానికి దోహదపడుతుంది అనడానికి మా భగత్‌ సింగ్‌ స్కూల్‌లో చదివి ఇవాళ వివిధ వృత్తుల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నవారిని చూస్తే అర్థమౌతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సామాజిక చైతన్యం, ఆట, పాటల్లో రాణించడం ఇవన్నీ మాకు మా స్కూల్‌ నుంచే మొదలయ్యాయి. మాకు విద్యా బుద్దులు నేర్పి, మేము ఇవాళ ఎంతో కొంత రాయగలుగుతున్నామంటే దానికి మూలం మా రాసకట్ల శంకర్‌ సార్‌. అందుకే టీచర్స్‌ డే అంటే మా సార్‌.. మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. క్యాన్సర్‌ మా సార్‌ను మా నుంచి దూరం చేసినా నా లాంటి వందలాది మంది విద్యార్థుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.  అక్షరజ్ఞానాన్ని అందిస్తూ  విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రతీ టీచర్ కు  హ్యాపీ టీచర్స్‌ డే.





No comments:

Post a Comment

Featured post

టీచర్స్‌ డే.. మా శంకర్‌ సార్‌

సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మా రాసకట్ట శంకర్‌ సార్‌ గుర్తుకు వస్తారు. ఆసరి రాజు లాంటి వందలాది మందికి అక్షర జ్ఞానం నేర్పించిన గుర...