న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జియో ఆర్బిట్ నుంచి పనిచేసే భారత్ తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05ను విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా 2,300 కిలోలకుపైగా బరువున్న EOS-05ను నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత కచ్చితత్వంతో ఇస్రో ప్రవేశపెట్టింది. దీంతో భారత అంతరిక్ష రంగం మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది.
‘‘ఇస్రోకు మరో అద్భుత విజయం.. మన దేశానికి గర్వకారణమైన క్షణం. EOS-05ను మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 విజయవంతంగా ప్రయోగించడమంటే.. జియోసింక్రనస్ కక్ష్య నుంచి పనిచేసే భారత్ తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడమే. భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇస్రోతో భారత పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని ప్రధాని తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన మొత్తం వ్యవస్థలో భారత్ సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతోందని చెప్పారు.
2026లో ఇస్రోకు తొలి విజయం
2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది తొలి విజయవంతమైన మిషన్‌గా నిలిచింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లిన సుమారు 18 నిమిషాల తర్వాత EOS-05ను నిర్దేశిత సబ్-జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టారు.
No comments:
Post a Comment