Showing posts with label #NepalFloods #FlashFloods #HimalayanFloods #IceAvalanche #Nepal #Kathmandu #Rasuwa #FloodDisaster #Hydropower #RescueOperations. Show all posts
Showing posts with label #NepalFloods #FlashFloods #HimalayanFloods #IceAvalanche #Nepal #Kathmandu #Rasuwa #FloodDisaster #Hydropower #RescueOperations. Show all posts

Wednesday, 26 August 2026

నేపాల్‌లో వరద బీభత్సం.. 162కు చేరిన మృతుల సంఖ్య



కాఠ్మాండు: హిమనదం నుంచి మంచు, రాళ్ల భారీ ప్రవాహం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య 162కు చేరగా.. భద్రతా సిబ్బంది, విదేశీ పర్యాటకులు సహా వందలాది మంది గల్లంతయ్యారు. మూడు జిల్లాల్లో భారీగా ఆస్తి, మౌలిక వసతుల నష్టం వాటిల్లింది.

చైనా సరిహద్దులోని రసువాగఢి సమీపంలో హిమనదం విరిగిపడి భోటేకోశి నదికి ఉపనది అయిన ల్హెండే ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగి ముందుగా టిమురే ప్రాంతాన్ని ముంచెత్తింది. అక్కడి వందలాది ఇళ్లతో కూడిన నివాస ప్రాంతం కొంత భాగం వరదలో కొట్టుకుపోయింది.

ఆ ప్రాంతంలో వర్షపాతం నమోదు కాకపోవడంతో స్థానికులకు ఎలాంటి ముందస్తు హెచ్చరిక అందలేదు. ప్రజలు తమ రోజువారీ పనుల్లో ఉండగానే వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. రసువా చీఫ్‌ కస్టమ్స్‌ అధికారి రాజేంద్ర ధుంగానా సహా పలువురు సమీపంలోని అడవుల్లోకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కస్టమ్స్‌ చెక్‌పోస్టు వద్ద నిలిపి ఉంచిన 300కు పైగా వాహనాలు, లారీలు వరదలో కొట్టుకుపోయాయి.

మంచు విరిగిపడటమే కారణం

నేపాల్‌-చైనా సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ల్హెండే నదిలో మంచు, రాళ్ల కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు నేషనల్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDRRMA) తెలిపింది. ఆ తర్వాత అడ్డంకి తెగిపోవడంతో భారీగా మట్టి, రాళ్లతో కూడిన వరద టిమురే మీదుగా త్రిశూలి నదిలోకి ప్రవహించినట్లు పేర్కొంది.

విపత్తు నిపుణుడు బసంత రాజ్‌ అధికారి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రసువాగఢికి ఎగువన సుమారు 20 కిలోమీటర్ల దూరంలో హిమనదం నుంచి మంచు విరిగిపడి ల్హెండే నదిని అడ్డుకోవడంతో ఈ భారీ వరద సంభవించిందని తెలిపారు.

ప్రధాన రహదారులు మూసివేత

వరదలు, కొండచరియల కారణంగా తొమ్మిది జిల్లాల్లో పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాఠ్మాండు నుంచి ఇతర జిల్లాలను కలిపే ప్రధాన మార్గమైన నాగ్‌ఢుంగా-ముగ్లింగ్‌ జాతీయ రహదారిపై రాకపోకలను నిరవధికంగా నిలిపివేశారు.

ఇలామ్‌లోని మేచి హైవే, కావ్రేలోని బీపీ హైవే, మకవాన్‌పూర్‌లోని కాంతి లోక్‌పథ్‌, రసువా, నువాకోట్‌ జాతీయ రహదారులు, ధాదింగ్‌లోని పృథ్వీ హైవే తదితర మార్గాల్లోనూ రవాణా నిలిచిపోయింది.

భారీ వరదలకు తొమ్మిది జలవిద్యుత్‌ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. 19 వాహన రాకపోకలకు అనువైన వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల రహదారులు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. తొమ్మిది వాణిజ్య బ్యాంకుల శాఖలు కూడా ప్రభావితమయ్యాయి.

మృతులు, గల్లంతైన వారి సంఖ్యను బట్టి చూస్తే.. 1993లో సర్లాహి, రౌతహట్‌, మకవాన్‌పూర్‌ జిల్లాల్లో సంభవించిన భారీ వరదల్లో 1,400 మంది మృతి చెందిన తర్వాత నేపాల్‌ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు.

Featured post

విధ్వంసం మిగిల్చిన ఆకస్మిక వరదలు

  నేపాల్‌లో వరద బీభత్సం..  కాఠ్మాండు, ఆగస్టు 26: టిబెట్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక...