Wednesday, 19 August 2026

పరీక్షలు రద్దు చేయొద్దు

 





 సచివాలయంలోకి దూసుకెళ్లిన అభ్యర్థులు.. జార్ఖండ్‌లో ఉద్రిక్తత

జార్ఖండ్‌లో నియామక పరీక్షల రద్దు నిర్ణయంపై నిరసనలు తీవ్రతరం అయ్యాయి. ప్రభుత్వం రద్దు చేసిన పరీక్షల్లో ఇప్పటికే ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బుధవారం రాంచీలోని జార్ఖండ్‌ సచివాలయంలోకి నిషేధాజ్ఞలను ధిక్కరించి ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసుల విజ్ఞప్తితో కొద్దిసేపటి తర్వాత వారు సచివాలయం నుంచి బయటకు వచ్చి తమ ఆందోళనను కొనసాగించారు.

జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (JPSC), జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (JSSC), ఔట్‌సోర్స్‌ సంస్థ నిర్వహించిన మొత్తం 22 నియామక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. మరో 23 పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమ నియామకాలను రద్దు చేసే ప్రమాదం ఉందని వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రద్దు చేసిన పరీక్షల్లో జేఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (JSSC-CGL) పరీక్ష కూడా ఉండటంతో విజయవంతమైన అభ్యర్థులు సోమవారం నుంచి నిరసనలు చేపడుతున్నారు. సచివాలయం వెలుపల శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతోనే సచివాలయంలోకి ప్రవేశించాల్సి వచ్చిందని అభ్యర్థులు తెలిపారు.

ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చందన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరో ఏఎస్‌ఓ శ్యామ్‌ సుందర్‌ మండల్‌ మాట్లాడుతూ తాము మెరిట్‌ ఆధారంగా పరీక్షలో ఉత్తీర్ణులయ్యామని, ఎలాంటి అక్రమాలకు తమకు సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ, అందరి ఉద్యోగాలను రద్దు చేసి మొత్తం బ్యాచ్‌ను ఎందుకు శిక్షించాలని ప్రశ్నించారు.

మరో అభ్యర్థి చాందినీ కుమార్‌ మాట్లాడుతూ ఈ ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి, పరీక్షలో ఉత్తీర్ణులై, నియామకం పొందిన తర్వాత నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగాలను రద్దు చేయడం తమ భవిష్యత్తును దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అయితే వారి తప్పులకు తమను బాధ్యులను చేయడం సరికాదని అభ్యర్థి అమిత్‌ కుమార్‌ అన్నారు.

మరోవైపు సచివాలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నందున సచివాలయంలో నిరసనకు దిగితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హతియా డీఎస్పీ నీరజ్‌ కుమార్‌ హెచ్చరించారు. పోలీసులు సూచించిన ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన కొనసాగించేందుకు అభ్యర్థులు అంగీకరించి సచివాలయం నుంచి బయటకు వచ్చారు.

జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 26 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం 22 పరీక్షలను రద్దు చేసి, 23 పరీక్షలపై దర్యాప్తునకు ఆదేశించింది. 2014 నుంచి నిర్వహించిన పలు కీలక పరిపాలనా, సాంకేతిక, న్యాయ నియామక పరీక్షలు ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చాయి. సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయం ప్రకటించగా, మంగళవారం రాత్రి ఎనిమిది నోటిఫికేషన్లు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

విజయవంతమైన అభ్యర్థుల ఆందోళనపై కాంగ్రెస్‌ మీడియా ఇన్‌చార్జి రాకేశ్‌ సిన్హా స్పందిస్తూ.. వారి ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే పరిష్కారం చూపుతుందని తెలిపారు. అయితే జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ రద్దు ఉత్తర్వులను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఆందోళన విరమించేది లేదని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు

 సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ...