- పెంటగాన్‌లో కీలక కసరత్తు
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌తో అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని పునఃసమీక్షించాలని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) భావిస్తోంది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలను తగ్గించడం, దాడుల్లో దెబ్బతిన్న సైనిక స్థావరాలను మునుపటి స్థాయిలో పునర్నిర్మించాలా లేదా అనే అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
ఎనిమిది మంది అధికారులను ఉటంకిస్తూ వచ్చిన ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం జరుగుతున్నది అధికారిక సమీక్ష కాకపోయినా, యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా సైనిక స్థావరాలు, బలగాల మోహరింపుపై తీసుకోవాల్సిన నిర్ణయాలకు ఇది ప్రాథమిక ప్రణాళికగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఇరాన్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా స్థావరాల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. యుద్ధానికి ముందు ఉన్న విధంగానే అన్ని స్థావరాలను తిరిగి నిర్మించకపోవచ్చని అమెరికా రక్షణ శాఖ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ కసరత్తుకు పెంటగాన్ పాలసీ కార్యాలయం నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయని ఓ సీనియర్ పెంటగాన్ అధికారి తెలిపారు. అయితే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇప్పటివరకు పశ్చిమాసియాలో అమెరికా సైనిక వ్యవస్థపై అధికారిక సమీక్షకు ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియను భవిష్యత్ నిర్ణయాలకు ఉపయోగపడే ‘‘వివేకవంతమైన ముందస్తు ప్రణాళిక’’గా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో జోర్డాన్ నుంచి ఒమన్ వరకు సుమారు 1,500 మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 20 ప్రాంతాల్లో 40 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి యుద్ధం నేపథ్యంలో అమెరికా యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, ఇతర సైనిక పరికరాలను భారీగా ఈ ప్రాంతానికి తరలించింది. ఇరాన్‌పై అమెరికా 13 వేలకు పైగా దాడులు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది.
పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలు తమ రక్షణ కోసం చాలాకాలంగా అమెరికా సైనిక బలగాలపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా బలగాలను తగ్గిస్తే, ఇరాన్ నుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కొనే విషయంలో ఆయా దేశాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా బలగాల లోటును భర్తీ చేసుకునేందుకు సొంత రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం లేదా ఇతర దేశాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలకు నెలల నుంచి సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, ఈ పరిణామం అమెరికా ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్న రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సైనిక జోక్యాలను సమర్థించే వర్గం ఒకవైపు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అమెరికా భద్రతా బాధ్యతలను కొంతమేర తగ్గించి దేశ రక్షణపై, అలాగే చైనా వంటి శక్తివంతమైన ప్రత్యర్థులను నిరోధించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని మరో వర్గం వాదిస్తోంది.
యూఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్లీ కూపర్ కూడా పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా సైనికులను మరింత పశ్చిమ దిశగా తరలించే అవకాశాలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొన్నట్లు ఓ అమెరికా అధికారి వెల్లడించారు. అయితే సెంట్రల్ కమాండ్ ప్రతినిధి దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమయ్యే ముందు నుంచే అమెరికా తన కొన్ని స్థావరాల నుంచి సిబ్బందిని తరలించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులకు ఆ స్థావరాలు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యుద్ధం ముగిసిన తర్వాత కూడా గల్ఫ్‌లోని కొన్ని ప్రధాన స్థావరాల నుంచి సైనిక బలగాలను దూరంగా ఉంచే మార్పులు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు.
అయితే అమెరికా సైనిక వ్యవస్థలో శాశ్వత మార్పులు ఇప్పటికిప్పుడు ఖరారయ్యే పరిస్థితి లేదని పెంటగాన్ వ్యవహారాలపై అవగాహన ఉన్న పలువురు అధికారులు హెచ్చరించారు. తుది నిర్ణయాలకు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నేతల అనుమతి అవసరం కానుంది.
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి సెప్టెంబర్ చివరి నాటికి అమెరికాకు సుమారు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని పెంటగాన్ అంచనా వేసింది. అయితే యుద్ధంలో దెబ్బతిన్న పశ్చిమాసియా సైనిక స్థావరాలను పునర్నిర్మించేందుకు అయ్యే వ్యయం ఈ అంచనాలో చేర్చలేదని ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
No comments:
Post a Comment